కొత్త జోన్‌.. కొత్త రూట్లు.. | South Coast Railway Zone officials work to increase connectivity | Sakshi
Sakshi News home page

కొత్త జోన్‌.. కొత్త రూట్లు..

Jun 28 2026 5:51 AM | Updated on Jun 28 2026 5:51 AM

South Coast Railway Zone officials work to increase connectivity

కనెక్టివిటీ పెంచేందుకు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అధికారుల కసరత్తు 

విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు కొత్త రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు 

కనెక్టివిటీ పెంచాలని గుంతకల్లు డీఆర్‌ఎం వినతి 

ధర్మవరం నుంచి వైజాగ్‌కు వయా గుంతకల్లు మీదుగా కొత్త రైలు 

జోన్‌లో విలీనమైన మిగిలిన ప్రాంతాలకూ రైళ్ల ప్రతిపాదనలు 

సాక్షి, విశాఖపట్నం : ప్రజల కోరిక మేరకు విశాఖపట్నం నుంచి వివిధ నగరాలకు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఆధ్వర్యంలో కొత్త రైళ్లన్నింటినీ నడిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే విశాఖ నుంచి ప్రయాణికులు కోరుకున్న ప్రధాన నగరాలకు కొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ఇటీవలే లాంఛనంగా ప్రారంభం కావడంతో, ప్రయాణికుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 

విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం డివిజన్లను కలుపుతూ ఏర్పడిన ఈ కొత్త జోన్‌.. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైలు సర్వీసుల పెంపుపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం విశాఖ నుంచి పలు కీలకమైన వాణిజ్య కేంద్రాలు, రాష్ట్ర రాజధానులు, ప్రముఖ పుణ్యక్షే త్రాలకు నేరుగా సరైన రైళ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రధాన మార్గాల్లో కొత్త ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటీ రైళ్లను ప్రవేశపెట్టేందుకు జోనల్‌ అధికారులు వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తున్నారు. 

రాయలసీమతో బలపడనున్న కనెక్టివిటీ 
విశాఖపట్నంతో రాయలసీమ ప్రాంతానికి ప్రత్యక్ష రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం ఈ సరికొత్త ప్రణాళికల్లో అత్యంత కీలకమైన అంశం. ఇందులో భాగంగా గుంతకల్లు డివిజన్‌కు చెందిన ఉన్నతాధికారులు.. విశాఖ నుంచి తమ పరిధిలోని ప్రాంతాలకు రైళ్ల సంఖ్యను పెంచాలని జోన్‌ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ని ఇటీవల కోరారు. ముఖ్యంగా ధర్మవరం నుంచి గుంతకల్లు మీదుగా విశాఖకు ఓ కొత్త రైలును నడిపే ప్రతిపాదనకు జోన్‌ అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో విశాఖ నుంచి బయల్దేరేలా ఈ సర్వీసును ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. 

ఈ రైలు నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అంతర్గత సర్వే కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ రైలు గనక పట్టాలెక్కితే అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల ప్రజలకు విశాఖతో రవాణా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. దీంతో పాటు ఏపీలోని పలు ఇతర ప్రాంతాల నుంచి వైజాగ్‌కు రోజువారీ రైళ్లను పెంచాలంటూ స్థానికుల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. అదేవిధంగా.. వారణాసి పుణ్యక్షేత్రానికి అదనపు రైళ్లు, విజయవాడ–విశాఖపట్నం మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్, చెన్నై మహానగరానికి అదనపు సర్వీసులు వంటి ఎన్నో కీలక ప్రతిపాదనలు ఇప్పటికీ కాగితాలకే పరిమితమయ్యాయి. 

అయితే తాజా జోనల్‌ కసరత్తులతో ఈ పాత ప్రతిపాదనలన్నింటికీ త్వరలోనే మోక్షం లభిస్తుందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో, విశాఖ నుంచి రైలు సర్వీసులు రెట్టింపయ్యే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయని రైల్వే ఉన్నతాధికారులు సైతం భావిస్తున్నారు.  

చాంతాడంత జాబితాకు మోక్షం లభించేనా..? 
ఒకవైపు కొత్త రైళ్ల ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నా.. గతంలో విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రతిపాదించి, ఇప్పటికీ ఆచరణలోకి రాని రైళ్ల జాబితా కూడా చాంతాడంత ఉంది. విశాఖపట్నం నుంచి నంద్యాలకు, అలాగే ఐటీ రాజధాని బెంగళూరుకు రోజువారీ నేరుగా ‘వందేభారత్‌’ లేదా ‘వందేభారత్‌ స్లీపర్‌’ కనెక్టివిటీ రైలు సర్వీసును ప్రారంభించాలనే ప్రతిపాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల బెంగళూరుకు ఒక వీక్లీ ట్రైన్‌ను రెగ్యులరైజ్‌ చేసినప్పటికీ, నిత్యం ప్రయాణించే వారి కోసం రోజువారీ రైలు ఖచ్చితంగా కావాలన్నది ప్రయాణికుల ప్రధాన వాదన.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement