
సాక్షి, కర్నూలు జిల్లా: ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన వారంతా ఐదవ తరగతి చెందిన విద్యార్థులే. ఈత కోసం వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.
చిగలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు స్కూల్ ముగిసిన అనంతరం.. గ్రామ శివారులోని నీటి కుంటలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో కుంటలో ఈతకు దిగిన విద్యార్థుల్లో ఆరుగురు చెరువులో మృత్యువాత పడ్డారు. మరో విద్యార్థి గ్రామస్థులకు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చాడు. ఆరుగురు చిన్నారులు మృతి చెందడంతో చిగలిలో విషాదం నెలకొంది.