ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రులు  | Sharan Navaratri Celebrations At Kanaka Durga Temple Vijayawada | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రులు 

Oct 17 2020 8:18 AM | Updated on Oct 17 2020 10:52 AM

Sharan Navaratri Celebrations At Kanaka Durga Temple Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ/ ఇంద్రకీలాద్రి: పవిత్ర కృష్ణానది తీరంలో అపర భూకైలాసంగా వెలుగొందుతున్న ఇంద్రకీలాద్రిపై శనివారం నుంచి అంగరంగవైభవంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభకానున్నాయి తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృతదుర్గా దేవిగా  ‘అమ్మ’ దర్శనమివ్వనున్నారు. పూర్వం మాధవవర్శ అనే రాజు ధర్మనిరతికి మెచ్చి కీలాద్రిపై జగజగ్జనిగా అవిర్భవించింది. ఇంద్రుడు జగజ్జనని దర్శించుకోవడంతో ఇంద్రకీలాద్రిగా భక్తులు పూజలు అందుకుంటోంది. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా తొలిరోజు పూజ అందుకుంటుంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లును దేవస్ధానం అధికారులు చేస్తున్నారు. శనివారం ఉదయం జరిగే స్నప్నభిషేకం, బాలభోగనివేదన, అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు.

కోవిడ్‌ నిబంధనలు తూచాతప్పకుండా పాటిస్తూ రాత్రి 8 గంటలకు దేవాలయాన్ని మూసివేస్తారు. ప్రతినిత్యం 10వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి, శనివారం నుంచి మల్లేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిçస్తున్నారు. మూలనక్షత్రం(ఆక్టోబర్‌ 21) రోజున తెల్లవారుజమున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. 24వ తేదీ అమ్మవారిని రెండు అలంకారాలలో భక్తులు దర్శంచుకోనున్నారు. ఉదయం దుర్గాదేవిగా, మ«ధ్యాహ్నం నుంచి మహిసాసురమర్ధని దేవిగా అలంకరిస్తారు. 25వ తేదీ (విజయదశమి) రోజున దుర్గాదేవి శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు, అనంతరం పూర్ణాహుతి, సాయంత్రం హంసవాహనంపై గంగ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వారు కృష్ణానదిలో విహరిస్తారు. 

పట్టువ్రస్తాలు సమర్పించిన సీపీ 
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు  దంపతులు శనివారం అమ్మవారిని పట్టువస్త్రాల ను సమర్పించారు. అమ్మవారి ఆలయానికి చేరుకున్న సీపీ దంపతులను, ఇతర పోలీసు అధికారులను  ఈవో ఎంవీ. సురేష్‌బాబు సాదరంగా స్వాగతం పలికారు. దసరా ఉత్స వాలలో  ప్రతి ఏటా నగర పోలీసు శాఖ నుంచి అమ్మవారికి పట్టువ్రస్తాలను సమర్పించడం ఆనవాయితీ. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం సీపీ, ఇతర పోలీసు అధికారులను  అర్చకులు ఆశీర్వచనం అందచేశారు. అనంతరం ఆలయ ఈవో  పోలీసు అధికారులకు అమ్మవారి ప్రసాదాలను అందచేశారు. కార్యక్రమంలో వెస్ట్‌ ఎసీపీ సుధాకర్, వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

దుర్గమ్మ సన్నిధానానికి పట్టువస్త్రాలను తీసుకువస్తున్న  పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు దంపతులు

వన్‌టౌన్‌ పీఎస్‌లో..
వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రతిరోజూ రౌడీలు, నేరాలు, దర్యాప్తులంటూ బిజీబిజీగా దర్శనమిచ్చే నగర పోలీసులు శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయారు. దుర్గమ్మకు పూజలు చేస్తూ యావత్‌ పోలీసు కుటుంబాలు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఆధ్యాత్మిక భావనతో గడిపారు. దుర్గమ్మ దసరా ఉత్సవాల ముందు రోజున పోలీసు శాఖ నుంచి అమ్మవారికి పట్టుచీర, పసుపు కుంకుమలను సమర్పించడం గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ఆ తంతు మరింత వైభవంగా నిర్వహించాలని పోలీసు కమిషనర్‌ నిర్ణయించి ఆ మేరకు అధికారును ఆదేశించారు.

రాష్ట్రం విడిపోయిన తరువాత కొత్త రాజధానిగా నూతన హంగులు సమకూరిన తరుణంలో ఈ విధమైన ఉత్సవానికి తెరలేపడంతో పోలీసు సిబ్బంది సైతం అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ప్రతిఏటా వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో దసరా ఉత్సవాలను నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో దుర్గమ్మ కొలువు తీరి ఉండటంతో అమ్మవారి సన్నిధిలో జరిగే దసరా ఉత్సవాల్లో పోలీసులు ప్రధాన పాత్ర పోషించడం తదితర కారణాల రీత్యా స్టేషన్‌ ప్రాంగణంలోనూ కలశాన్ని ఏర్పాటు చేసి నిత్యం భారీగా పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

శుక్రవారం రాత్రి పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు చేరుకొని అక్కడ ప్రతి ఏటా నిర్వహించే విధంగా రావిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు నగరంలోని సీఐలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా మహిళా పోలీసు అధికారులందరూ సివిల్‌ డ్రస్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత స్థానిక సీఐ వెంకటేశ్వర్లు దంపతులు స్టేషన్‌లో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని మేళతాళాలతో ప్రాంగణంలో ఉన్న రావిచెట్టు వద్ద తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. 

నేటి అలంకారం 
స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి 
మాతర్మే మధుకైటభఘ్ని 
మహిషప్రాణాపహోరోద్యమే 
హేలానిర్మిత ధూమ్రలోచన వదే
హేచండముండార్ధిని.. 
నిశ్శేషీకృత రక్తబీజ దనుజే.. నిత్యే.. నిశుంభావహే 
శుంభధ్వంసిని సంహరాశు 
దురితం దుర్గే– నమస్తే అంబికా.. 

దసరా మహోత్సవాలలో మొదటి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి శనివారం  అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీదుర్గాదేవిగా అలంకరిస్తారు. పూర్వం మాధవవర్మ అనే మహారాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు(దుర్గాదేవి) విజయవాటికాపురి లో కనకవర్షం కురిపించింది. అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గగా కొలవబడుతూ దసరా మహోత్సవాలలో తొలిరోజున స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించడం జరుగుతుంది.  అమ్మవారి దర్శనంతో సకల దారిద్రాలు నశించడంతో పాటు శుభదాయకం, ఆనందదాయకం, ఐశ్వర్యప్రదాయ కమని  భక్తుల నమ్మకం...  –ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement