
స్విమ్స్‌లో సెక్యూరిటీ సిబ్బంది ఆగడాలు
రోగులు.. సహాయకులపై యథేచ్ఛగా దాడులు
చేతులెత్తేస్తున్న ఆస్పత్రి అధికారులు
అనారోగ్యంతో ఉన్న తన భర్తకు వైద్యం చేయించేందుకు అనంతపురం నుంచి ఓ మహిళ స్విమ్స్‌కు వచ్చింది. జనరల్ ఫిజీషియన్ ఓపీ చూపించుకునేందుకు వెళుతుండగా అడుగడుగునా సెక్యూరిటీ ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె సకాలంలో ఓపీ తీసుకోలేక వెనుతిరిగింది. బాధితురాలు మాట్లాడుతూ మహిళ అని కూడా చూడకుండా సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని కంటతడి పెట్టుకుంది. ఊరు కానీ ఊరు వచ్చిన మాతో ఇలా వ్యవహరించడం సరి కాదని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త అనారోగ్యం కంటే సెక్యూరిటీ తీరే ఎక్కువ బాధించిందని వెల్లడించింది.
ఇది మచ్చుకు ఒకటే.. ఇలాంటివి తిరుపతి స్విమ్స్‌లో నిత్యం జరుగుతూనే ఉంటాయి. సెక్యూరిటీ సిబ్బంది కారణంగా రోగులు.. సహాయకులకు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి.
తిరుపతి తుడా: టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఆగడాలు శృతి మించాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో రోగులు.. సహాయకులకు దిక్కుతోచని పరిస్థితులు తలెత్తుతున్నాయి. కనీస మర్యాదలేకుండా ఆస్పత్రికి వచ్చిన వారితో సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు.
నెట్టేస్తూ.. తరిమేస్తూ..
స్విమ్స్‌లోని ఎమర్జన్సీ, ఐసీయూ, ఆర్‌ఐసీయూ విభాగాల వద్ద రోగుల సహాయకులు కనిపెట్టుకుని ఉంటారు. లోపల చికిత్సపొందుతున్న వారికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని కూర్చొని ఉంటారు. రాత్రివేళల్లో ఆయా విభాగాల వెలుపలే నిద్రిస్తుంటారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది మాత్రం రోగుల సహాయకులను పురుగుల కంటే హీనంగా విదిలించేస్తున్నారు. ఇక్కడ ఎవరూ ఉండకూడదు అంటూ తరిమేస్తున్నారు. తమ వారికి అకస్మాత్తుగా ఏదైనా అవసరం వస్తే అందుబాటులో ఉండాలి కదా అని సహాయకులు సమాధానమిస్తే అసభ్యంగా దూషిస్తున్నారు. బలవంతంగా ఆయా ప్రాంతాల నుంచి నెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బుధవారం రాత్రి 11 గంటల సమయంలో రోగుల సహాయకులపై దౌర్జన్యానికి దిగారు.
టీటీడీ ఈఓకు ఫిర్యాదు చేస్తామంటే దాడి చేశారు. ‘‘ఈఓ ఎవర్రా.. ఇది మా రాజ్యం.. ఇక్కడ మేం చెప్పిందే జరుగుతుంది’’ అంటూ నిరోగుల సహాయకులను నిర్ధాక్షిణ్యంగా తోసేశారు. పైగా బాత్‌రూమ్‌లకు తాళాలు వేసి మీ దిక్కున్నచోట చెప్పుకోండని వెళ్లిపోయార బాధి తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి స్విమ్స్‌లో సెక్యూరిటీ సిబ్బంది ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు. లేకుండా ఉన్నత ఆశయంతో నెలకొల్పిన ఆస్పత్రి ప్రతిష్ట మసకబారుతుందని హెచ్చరిస్తున్నారు.