ఆ 982 పోస్టులను త్వరగా భర్తీ చేయండి

SEC and CS video conference with Collectors on election preparations - Sakshi

కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశం

పటిష్ట నిఘాకు 105 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల ఏర్పాటు

ఎన్నికలతో సంబంధమున్న అధికారుల బదిలీ దాదాపు పూర్తి

పోలింగ్‌ కేంద్రాల్లో మరుగుదొడ్లు, విద్యుత్, ర్యాంపులు వంటి సౌకర్యాలు త్వరగా కల్పించాలి

ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లతో ఎస్‌ఈసీ, సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌      

సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం (కలెక్టరేట్లు), అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజక­వర్గ రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలకు మంజూరైన 982 పోస్టులను త్వరగా భర్తీ­చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురు­వారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (ఎస్‌ఈసీ) ముఖేశ్‌కుమార్‌ మీనాతో కలిసి ఆయన ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లా­డుతూ.. ఎన్నికలతో సంబంధం ఉండి మూడేళ్లు సర్వీసు పూర్తిచేసు­కున్న వివిధ శాఖల అధికా­రుల బదిలీ ప్రక్రియ దాదాపు పూర్తయింద­న్నారు. ఇప్పటికే పీఆర్‌ అండ్‌ ఆర్డీ, ఎక్సైజ్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోల్లో బదిలీల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు పోలీస్, రెవె­న్యూ శాఖల్లో కొంతమేర బదిలీలు జరగ్గా మిగా­తా బదిలీలు ఒకట్రెండు రోజుల్లో పూర్తిచేయా­లని సీఎస్‌ ఆదేశించారు. అలాగే.. మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో బదిలీలు కూడా రెండు రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు.

చెక్‌పోస్టుతో అక్రమ రవాణాకు కళ్లెం..
ఇక ఎన్నికల్లో పటిష్ట నిఘా నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 105 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటుచేయగా వాటిలో 20 ఇంటిగ్రేటెడ్‌ చెక్‌­పో­స్టులని.. పోలీసు శాఖ ద్వారా 62, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ద్వారా 9, అటవీశాఖ ద్వారా 14 చెక్‌పోస్టులను ఏర్పాటు­చేసినట్లు సీఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. గత నెలరోజుల్లో అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు ద్వారా రూ.2.35 కోట్ల నగదు, 51,143 లీటర్ల మద్యం, 1,323 కిలోల వివిధ మాదకద్రవ్యాలను, ఇతర విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

ఈ చెక్‌ పోస్టులన్నీ రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసి అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సూచించారు. అలాగే, పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలకు సంబంధించి ముఖ్యంగా తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్‌ సరఫరా, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ర్యాంపుల ఏర్పాటు వంటి సౌకర్యాలను త్వరగా ఏర్పాటుచేసేందుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎస్‌ చెప్పారు.

లాజిస్టిక్‌ ఏర్పాట్లకు చర్యలు తీసుకోండి..
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌­కుమార్‌ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ లాజిస్టిక్‌ ఏర్పాట్లకు ఇప్పటినుంచే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇంకా ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి తీసుకోవాల్సిన ఇతర అంశాలపై ఆయన వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓ కోటేశ్వరరావు, పీఆర్‌ అండ్‌ ఆర్డీ కమిషనర్‌ సూర్యకుమారి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ జె.నివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top