ఖట్మండూ: నేపాల్‌లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల బరిలో నలుగురు మాజీ ప్రధానులు నిలిచారు. జెన్–జీ తిరుగుబాటు తరువాత మార్చి 5న సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. నలుగురు మాజీ ప్రధానులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్–లెనినిస్ట్) అధ్యక్షుడు, పదవీచ్యుతుడైన ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి ఝాపా–5 నుంచి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్) మాజీ ప్రధాన మంత్రి పుష్పకమల్ దహల్ ’ప్రచండ’ రుకుమ్ ఈస్ట్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మరో ఇద్దరు మాజీ ప్రధానులు మాధవ్ కుమార్, ప్రగతిశీల లోకతాంత్రిక్ పార్టీకి చెందిన బాబురామ్ భట్టరాయ్ రౌతహత్–1, గూర్ఖా–2 నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఓలికి 74 ఏళ్లు, ప్రచండ, భట్టారాయ్‌లకు 71 ఏళ్లు, మాధవ్ కుమార్‌కు 72 ఏళ్లు.
వీరే కాదు, దేశవ్యాప్తంగా ముగ్గురు మేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి పదవులకు రాజీనామా చేశారు. ఈ ముగ్గురిలో ప్రముఖుడు, ప్రజాదరణ పొందిన నాయకుడు ఖట్మండూ మెట్రోపాలిటన్ సిటీ మాజీ మేయర్ బాలేంద్ర షా. ఈయన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా ఝాపా–5 నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఆయనకు రాజకీయంగా మంచి పేరు ఉంది. ఖాట్మండూ మహానగరానికి మేయర్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన బాలేంద్రను జనం ‘బాలెన్ షా’ అని పిలుచుకుంటారు. జెన్–జీ హింసాత్మక నిరసనల నేపథ్యంలో సెప్టెంబర్ 9న ఓలి.. ప్రధానమంత్రి పదవికి రాజీ నామా చేశారు. దీంతో నేపాల్‌లో సార్వ త్రిక ఎన్నికలు అనివార్యమయ్యాయి. నేపాల్ ప్రతినిధుల సభలో 275 సీట్లుండగా.. అందులో 165 సీట్లకు ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది. 110 సీట్లకు దామాషా పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ 165 సీట్ల కోసం 3,500 మందికి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో 400 మంది మహిళా అభ్యర్థులు. ఇక, ఈ ఎన్నికల్లో సుమారు 1.9కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.


