ఆ దిశలోనే కన్ఫెషన్ స్టేట్‌మెంట్స్.. కాన్సిపిరసీ థియరీ
ఇదే సీఎం చంద్రబాబు ఏడాదిన్నర దారుణ పాలన
చంద్రబాబు మోసాలను ప్రజలంతా గుర్తించారు
అందుకే కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన
వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీపై కక్షసాధింపే టీడీపీ కూటమి సర్కారు టార్గెట్ అని, ఆ నినాదాన్ని భుజానికెత్తుకుని తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆరి్డనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆ దిశలోనే కన్ఫెషన్ స్టేట్‌మెంట్స్‌తో కాన్సిపిరసీ థియరీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆక్షేపించారు. అందులో నుంచి వచ్చినవే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి , పరకామణి, లిక్కర్ వంటి కేసులు అని వెల్లడించారు.
ఏ ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసులు నమోదు చేసి ఎవరో ఒకరిని అరెస్టు చేయడం, బెదిరించడం.. ఆ తర్వాత వాంగ్మూలాలు నమోదు చేయడం.. వాటి ఆధారంగా టార్గెట్ లిస్ట్‌లో ఉన్న వారిపై కేసులు పెడుతూ, వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధిస్తున్నారని.. అదే సీఎం చంద్రబాబు నమ్ముకున్న కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీ అని సజ్జల మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..
నెయ్యిపై ఏ ఆధారాలతో సిట్ విచారణ?..
2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీని అమలు చేసి ఉంటే, అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే ఆయన్ను అరెస్ట్ చేసే వాళ్లం. కానీ, ఏనాడూ మేము కక్షపూరితంగా వ్యవహరించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంటూ, ఏ ఆధారాలతో సిట్ ద్వారా విచారణ చేయిస్తుందో అర్థం కావడం లేదు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేస్తున్న సిట్, 2014–19 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపైనా విచారణ చేస్తే అసలు నిజాలు తెలుస్తాయి. 2019 –24 మధ్య కేజీ నెయ్యి రూ.320 చొప్పున సేకరిస్తేనే కల్తీ అన్న నాయకులు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.270కే సేకరించినప్పుడు కల్తీ జరిగినట్లు కాదా? ప్రభుత్వాలు మారినా టీటీడీలో దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవస్థల ప్రకారమే టెండర్ల నిర్వహణ, క్వాలిటీ చెకింగ్ జరుగుతుంది.
పరకామణి చోరీ అంటూ కేసు పెట్టి, వైఎస్సార్‌సీపీ నాయకులను ఇరికించే ఉద్దేశంతోనే విచారణ పేరుతో ఏవీఎస్‌వో సతీష్ కుమార్‌ను సిట్ వేధించింది. ఆ బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మేం మాట్లాడితే.. ఆధారాలు లేకుండానే హత్యగా ప్రచారం చేసిందే కాకుండా వైఎస్సార్‌సీపీ నాయకులే చంపించారని మాపై బురదజల్లారు.
రిజెక్ట్ చేసిన నెయ్యిని ఎలా వాడారు?..
‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలైలో క్వాలిటీ చెక్ తర్వాత నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి వెనక్కి పంపారని చెబుతున్నారు. వెనక్కి పంపిన నెయ్యిని తిరిగి తీసుకొస్తే వాడినట్టు సిట్ రిపోర్టులో ఉంది. అలాంటప్పుడు రిజెక్ట్ చేసిన నెయ్యినే కూటమి ప్రభుత్వంలో ఎలా వాడారు?
టీడీపీ హయాంలో జరిగిన తప్పునకు చంద్రబాబు బాధ్యత తీసుకోరా? లిక్కర్ కేసులో ఇన్నాళ్లుగా విచారణ చేస్తున్న ప్రభుత్వం ఏం సాధించినట్టు? న్యాయస్థానాల దగ్గర విచారణ పేరుతో మా నాయకులను అదుపులోకి తీసుకుని నెలల తరబడి జైలుపాలు చేశారు.’’ అని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
ఎస్ బ్యాంకులో టీటీడీ నిధుల జమ నియమాలకు విరుద్ధం కాదా?
‘‘ప్రైవేట్ బ్యాంకులో 10 శాతానికి మించి టీటీడీ నిధులు డిపాజిట్ చేయకూడదనే నిబంధన ఉంది. కానీ టీటీడీ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి ఎస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంకులో రూ.1300 కోట్లకు పైగా జమ చేశారు. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాక దాన్ని జాతీయ బ్యాంకుల్లోకి మార్చారు. ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన దానికి చంద్రబాబే కారణమని మేం ఆరోపించామా? కుట్ర రాజకీయాలు చేశామా?’’ అని సజ్జల ప్రశ్నించారు.
లాయర్‌కు రూ.8 కోట్ల ఫీజు!
‘‘చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వాదించిన లాయర్ సిద్దార్థ లూథ్రాని తీసుకొచ్చి వైఎస్సార్‌సీపీ నాయకుల మీద బనాయించిన అక్రమ కేసులన్నీ ఆయనకే అప్పజెప్పారు. ఈ కేసులకు ఆయనకు ఇప్పటి వరకు రూ.8 కోట్లకు పైగా జనం సొమ్మును ఫీజు కింద చెల్లించారు’’ అని సజ్జల విమర్శించారు.
కేసుల క్లోజర్ కుట్ర!
‘‘సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగంతో కేసులు క్లోజ్ చేయించుకునే కుట్ర చేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంతోపాటు, బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు కేసులను మాఫీ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక బాబుపై ఉన్న అన్ని కేసులూ మళ్లీ బయటకు తీస్తాం.’’ అని రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.
ఎందుకంత కడుపు మంట?
‘‘తెలంగాణలో బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం మాకేంటి. వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు. 2014 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే వైఎస్సార్‌సీపీకి 7శాతం ఓట్లు వచ్చాయి. అయినా తెలంగాణ రాజకీయాలు వద్దనుకుని వచ్చిన మాకు బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్‌కు జనాదరణ పెరుగుతుంటే టీడీపీ, ఎల్లోవీుడియాకు ఎందుకంత కడుపుమంట?’’ అని సజ్జల ప్రశ్నించారు.
కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన
‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో తీసుకొచి్చన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందుకే వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో భారీగా పాల్గొని సర్కారుపై గళమెత్తుతున్నారు. కోటి సంతకాల సేకరణ గొప్ప ప్రజా ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోతుంది.’’ అని సజ్జల పేర్కొన్నారు.
ఒక్క ఇల్లు కట్టించకపోయినా క్రెడిట్ చోరీ..
‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో పూర్తి చేసిన 3 లక్షల ఇళ్లను కూటమి ప్రభుత్వంలో ఇచ్చినట్టు చెప్పుకోవడం దారుణం. పేదల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.
అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే..
‘‘చంద్రబాబు తల్లి అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే. లోకేశ్ పక్కనే ఉన్నారు కాబట్టి ఆ కథనే చాగంటి మరో రకంగా చెప్పారు. గూగుల్ డేటా సెంటర్‌కి సంబంధించి అదానీ పేరెత్తితే వైఎస్ జగన్ కి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు కిక్కురుమనడం లేదు. విశాఖలో అనామక కంపెనీలకు బాబు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. అదే హెరిటేజ్ ఆస్తులైతే అంత తక్కువ ధరకు ఇస్తారా?’’ అని సజ్జల నిలదీశారు.


