దారుణంగా పతనమైన అరటి ధరలు..
కిలో రూపాయికీ కొనేవారు కరువు
వేలాది ఎకరాల్లో తోటలు దున్నేస్తున్న రైతులు
గుడ్లప్పగించి చూస్తున్న చంద్రబాబు సర్కారు
మొక్కుబడి సమీక్షలతోనే సరి.. రైతులను ఆదుకునే దిశగా చర్యలు శూన్యం
మిరప.. పొగాకు.. మామిడి.. ఉల్లి తరహాలోనే అరటి రైతుల జీవితాలతో చెలగాటం
కరోనా విపత్తు వేళ మార్కెట్‌లో జోక్యం చేసుకొని అరటి రైతును ఆదుకున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అరటి రైతు ఆక్రందన.. అరణ్యరోదనగా మారింది. ఓ పక్క చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పాతాళానికి దిగజారిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ముందెన్నడూ లేని సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్న అరటి రైతును ఆదుకునేందుకు కనీస చర్యలూ తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇలాంటి విపత్తు వేళ నిజంగా రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి, మానవత్వం పాలకుల్లో ఉంటే యుద్ధ ప్రాతిపదికన స్వయంగా రంగంలోకి దిగాలి.
అన్నదాతకు అండగా నిలవాలి. ఆపన్న హస్తం అందించాలి. తక్షణమే జోక్యం చేసుకొని కనీస మద్దతు ధరకు రైతుల వద్ద ఉన్న అరటిని కొనుగోలు చేసి ప్రభుత్వమే స్వయంగా మార్కెటింగ్ చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మొక్కుబడి సమీక్షలు, కంటితుడుపు చర్యలతో సరిపెడుతోంది తప్ప రైతులను ఆదుకునే దిశగా ఒక్క అడుగూ ముందుకేసిన పాపాన పోలేదు. మిరప.. పొగాకు.. మామిడి.. ఉల్లి తరహాలోనే అరటి రైతుల జీవితాలతోనూ బాబు సర్కారు చెలగాటమాడుతోంది.
టన్ను రూ.1,000కు దిగజారిన ధర..
రాష్ట్రంలో 2.77 లక్షల ఎకరాల్లో అరటి సాగవుతోంది. వైఎస్సార్ కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనే లక్ష ఎకరాలకుపైగా సాగవుతోంది. ఇక్కడ మాత్రమే సాగయ్యే జీ–9 వెరైటీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువ. ఇది పూర్తిగా ఎక్స్ పోర్ట్ క్వాలిటీ. ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులవుతున్నాయి. దాదాపు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తున్నా యి.
టిష్యూకల్చర్ ద్వారా నాటిన మొదటి పంట దిగుబడులు అనంతపురం, నంద్యాల జిల్లాలలో డిసెంబర్ నుంచి మార్చి వరకు, వైఎస్సార్ కడప నుంచి జనవరి నుంచి మే వరకు కొనసాగుతుంది. రెండో పంట పిలకల ద్వారా వచ్చే పంట (రెండో పంట) జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. 2023–24లో టన్ను రూ.30వేలకు పైగా పలికింది. అలాంటిది చంద్రబాబు సర్కారు అసమర్థ విధానాల వల్ల ప్రస్తుతం టన్ను రూ.1,000 పలకడం గగనమైపోయింది.
సంక్షోభానికి కారణమిదే..
ఈ ఏడాది మహారాష్ట్రలో ఉన్న సాగు విస్తీర్ణం 30నుంచి 40 శాతం పెరిగింది. మరొక వైపు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా అరటి సాగు మొదలైంది. సాధారణంగా మహారాష్ట్రలో ఏటా అక్టోబర్ కల్లా పంట కోతలు పూర్తయ్యేవి. దీంతో నవంబర్ నుంచి ఢిల్లీ వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌కు వచ్చేవారు. ఈసారి మహారాష్ట్రలో ఏరియా పెరగడం వలన కోతలు కొనసాగుతున్నాయి. అక్కడ నుంచి ఉత్తర భారతదేశానికి ఏపీతో పోలిస్తే రవాణా ఖర్చులు తక్కువ.
ఉదాహరణకు ఒక లారీ ట్రాన్స్‌పోర్టు చేయాలంటే ఏపీ నుంచి ఢిల్లీకి రూ.60 వేల నుంచి రూ.70వేలు ఖర్చవుతుండగా, మహారాష్ట్ర నుంచి రూ.30 వేల నుంచి రూ.40వేలు ఖర్చవుతుంది. పంట ఉన్నంత కాలం అక్కడ నుంచే కొనుగోలు చేసేందుకు ఢిల్లీ వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పిలక ద్వారా వచ్చే రెండో పంట (రెటూన్ క్రాప్) కోతకొచ్చింది.
ధరల పతనాన్ని ముందుగానే పసిగట్టిన అధికారులు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా అక్టోబర్ రెండో వారం వరకు కిలో రూ.8 నుంచి రూ.10 వరకు పలికిన ధర కాస్తా ఆ తర్వాత క్రమేపి క్షీణించి రూపాయికి దిగజారింది.
చంద్రబాబుకు నిజంగా మానవత్వం ఉండి ఉంటే..
వైఎస్ జగన్ హయాంలో కరోనా విపత్తు వేళ కూడా ఇదే రీతిలో ధరలు పతనమవుతున్న సందర్భంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని అరటి రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొని అండగా నిలిచింది. ఈ విధంగా దాదాపు 16వేల టన్నులకుపైగా అరటిని కొనుగోలు చేసి సబ్సిడీ ధరపై వినియోగదారులకు అందజేసింది. ఒక్క అరటే కాదు.. ఆ తర్వాత బత్తాయికి ధర లేనప్పుడు కూడా ఇదే రీతిలో చొరవ తీసుకుని 4,109 టన్నుల బత్తాయిని రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించి డ్వాక్రా సంఘాల సభ్యులకు సబ్సిడీపై అందజేసింది.
కిలో రూపాయికి కూడా కొనేవాడు లేకపోవడంతో రేయింబవళ్లు కంటికిరెప్పలా పెంచిన పచ్చని అరటి తోటలను తమ చేతులతోనే నేలకూల్చేస్తూ..పంటలను దున్నేస్తుంటే సీఎం చంద్రబాబు కనీసం మానవత్వం చూపడం లేదు. నిజంగా పాలకులకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈపాటికే చొరవ తీసుకుని రైతుల నుంచి కనీసం కిలో రూ.15 నుంచి రూ.20 మధ్య కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా వినియోగ దారులకు సబ్సిడీపై పంపిణీ చేయడం లేదా కనీసం మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందించే ఆలోచన చేసేవారు. కానీ అలా చేయలేదు.
ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష చేసినప్పుడు ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. కానీ చంద్రబాబు మాత్రం మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతున్నారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించండి.. ఢిల్లీ వ్యాపారులతో అనుసంధానం చేయండి అంటూ ఆదేశాలివ్వడం తప్ప రైతులను ఆదుకునే దిశగా ఎలాంటి ప్రత్యక్ష చర్యలూ తీసుకున్న పాపాన పోవడం లేదు. ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చందంగా ఇప్పుడు ఢిల్లీ వ్యాపారులతో ట్రేడర్స్ మీట్స్ అంటూ హంగామా చేస్తున్నారు.
బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.40–100
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని బహిరంగ మార్కెట్లో అరటి నాణ్యతను బట్టి కిలో రూ.40 నుంచి రూ.60 పలుకుతున్నాయి. కాస్త పెద్ద సైజు (ఎక్స్‌పోర్టు క్వాలిటీ) అయితే కిలో రూ.60 నుంచి రూ.80 కూడా పలుకుతున్నాయి. హైపర్ మార్కెట్లలో అయితే కిలో రూ.100 కూడా పలుకుతున్నాయి. చివరికి అరటి పంట ఎక్కువగా ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లోనూ కిలో రూ.40కు తక్కువ అమ్మడం లేదు.
కానీ అరటి పండించే రైతుకు మాత్రం కిలో రూపాయికి మించి పలకడం లేదు. మధ్యలో ఈ సొమ్ములంతా దళారుల మాటున అధికార టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి. కారణం ప్రధాన అరటి మార్కెట్లతోపాటు సీమలోని మార్కెట్ యార్డులన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఉన్నాయి.
ఇక్కడ వ్యాపారం చేయాలంటే పచ్చ ముఠాలకు మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. దీంతో ఇక్కడి టీడీపీ నేతలు వ్యాపారులతో కుమ్మక్కై.. రైతులకు ధర లేకుండా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు.


