రాజస్థాన్‌లోనూ ఆర్బీకే తరహా సేవలు

Rythu Bharosa Centres Also In Rajasthan - Sakshi

మా రాష్ట్రంలో కూడా కియోస్క్‌లు.. ప్రొక్యూర్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం

త్వరలో మరోసారి ఏపీకి అధికారుల బృందాన్ని పంపిస్తాం

రాజస్థాన్‌ వ్యవసాయ మంత్రి లాల్‌చంద్‌ కటారియా వెల్లడి

సాక్షి, అమరావతి/నారాయణవనం (తిరుపతి): ఆంధ్రప్రదేశ్‌ రైతులకు గ్రామస్థాయిలో సేవలందించేందుకు ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని రాజస్థాన్‌ వ్యవసాయ శాఖ మంత్రి లాల్‌చంద్‌ కటారియా ప్రశంసించారు. ఇదే తరహాలో రాజస్థాన్‌లో కూడా సేవలం దించాలని తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం తిరుపతి జి ల్లా నారాయణవనం మండలం భీమునిచెరువు ఆర్బీకేను ఆయన సందర్శించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

అక్కడ అగ్రి ఇన్‌పుట్‌ షాప్, లైబ్రరీ, మాయిశ్చర్‌ మీటర్, సీడ్‌ టెస్టింగ్‌ కిట్, కియోస్క్‌ల పని తీరు.. వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు బుక్‌ చేసుకునే విధానాన్ని పరిశీలించారు. కియోస్క్‌లో వాతావరణం, దేశవ్యాప్త మార్కెట్‌ ధరల సమాచారం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. కియోస్క్‌ల పనితీరును ప్రత్యేకంగా అభినందించిన ఆయన.. రాజస్థాన్‌లో కూడా వీటిని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. అలాగే, ఏపీ తరహాలోనే రాజస్థాన్‌లో కూడా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఏ ర్పాటుచేశామని, వాటి ద్వారా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

ఆర్బీకేల ద్వారా అందిస్తున్న పాడి సేవలనూ కటారియా మెచ్చుకున్నారు. మొబైల్‌ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్‌లను పరిశీలిం చి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. వీటిని తమ రాష్ట్రంలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇక ఏపీలో గ్రామ, జిల్లా, రాష్ట్రస్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటుచేసి పంటల ప్రణాళికలో రైతులను భాగస్వామ్యం చేస్తున్న తీరును తెలుసుకున్న మంత్రి కటారియా ఇది ఒక వినూత్నమైన ఆలోచనన్నారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా రైతులను భాగస్వామ్యం చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చునన్నారు.

ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోళ్ల విధానాన్ని పరిశీలించిన ఆయన రాజస్థాన్‌లో కూడా ప్రొక్యూర్‌మెంట్‌ కేంద్రాలను గ్రామస్థాయిలో ఏర్పాటుచేయబోతున్నామని చెప్పారు. ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో జరుగుతున్న రైతు విస్తరణ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నంతగా మరే రాష్ట్రంలోనూ జరగటంలేదన్నారు. ఏపీని మోడల్‌గా తీసుకోబోతున్నట్లు కటారియా చెప్పారు. త్వరలోనే ఏపీకి ప్రత్యేక అధికారుల బృందాన్ని మరోసారి పంపనున్నట్లు ఆయన తెలిపారు. 

సీఎం జగన్‌ నాకు మంచి స్నేహితుడు
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు మంచి స్నేహితుడని.. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తాను కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించానని గుర్తుచేశారు. అనంతరం.. ఇటీవల ఈ ఆర్బీకే పరిధిలోని రైతు కమిటీకి అందజేసిన ట్రాక్టర్, యంత్ర పరికరాలను పరిశీలించారు. రైతులతో కలిసి ట్రాక్టర్‌ను నడిపారు. ఆ తర్వాత సమీప వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో ముచ్చటించారు.  అనంతరం కటారియా.. పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top