రాష్ట్ర ఐటీ రంగం ఎగుమతుల్లో 13 శాతం వృద్ధి

Rs 2,500 crore IT exports from Andhra Pradesh - Sakshi

రాష్ట్రం నుంచి రూ.2,500 కోట్ల ఐటీ ఎగుమతులు

2019–20లో రూ.2,200 కోట్ల విలువైన ఎగుమతులు

2020–21లో 13 శాతం వృద్ధి నమోదు

కరోనా సమయంలోనూ పెరిగిన ఐటీ ఎగుమతులు

సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఐటీ రంగం ఎగుమతుల్లో 13 శాతం వృద్ధి నమోదైంది. ఒకపక్క కోవిడ్‌–19తో ఏడాది మొత్తం ఉద్యోగులు ఇంటివద్ద నుంచే పనిచేయాల్సి వచ్చినా.. ఐటీ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదు కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం 2020–21లో రాష్ట్రం నుంచి రూ.2,500 కోట్ల విలువైన ఎగుమతులు జరిగినట్లు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 2019–20లో రాష్ట్రం నుంచి రూ.2,200 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగాయి. 2019–20లో 10 శాతం వృద్ధి నమోదు కాగా 2020–21లో 13 శాతం వృద్ధి నమోదైంది.

లాక్‌డౌన్‌ సమయంలో ఐటీ కంపెనీలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఇంటి వద్ద నుంచే పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న విశాఖ, తిరుపతి, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్, అవాంతరాలు లేకుండా విద్యుత్‌ సౌకర్యాలు కల్పించింది. ఐటీ కంపెనీల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఐటీ కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసింది.  ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కంపెనీల్లో 45 వేలమంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు.

రెండేళ్లలో రూ.500 కోట్ల వృద్ధి
విభజన సమయంలో రూ.1,500 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు ఇప్పుడు రూ.2,500 కోట్లకు చేరుకున్నాయి. గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ఎగుమతులు రూ.500 కోట్లు పెరిగితే గడిచిన రెండేళ్లలోనే మరో రూ.500 కోట్ల వృద్ధి నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  రాష్ట్రంలో ఐటీ రంగ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టిసారించామని, ముఖ్యంగా విశాఖను ఐటీ, నాలెడ్జ్‌హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top