
విశాఖపట్నం: అంబేద్కర్ ఆశయసాధన పేరుతో వేలాది మందికి కుచ్చుటోపీ పెట్టి, కోట్ల రూపాయలు కాజేసిన స్నేహా మ్యాక్స్ సంస్థపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. దువ్వాడ పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి కటికల శివభాగ్యారావు అంబేద్కర్ ఆశయాలు సాధన కోసం అంటూ ‘స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ’ని స్థాపించారు. ఉన్నతాధికారిగా పని చేసిన వ్యక్తి, అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నాడని నమ్మి అనేకమంది సభ్యులుగా చేరారు.
తమ సంస్థలో డబ్బు ఆదా డిపాజిట్ చేస్తే 12 శాతం వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికాడు. ఇలా రూ.100 కోట్లవరకూ వసూలు చేశాడు. అంతేకాకుండా సంస్థకు వచ్చిన లాభాలను దళితుల సంక్షేమానికి వినియోగిస్తానని తెలిపాడు. దీంతో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు దాదాపు 2,500 మంది వరకు సభ్యులుగా చేరారు. లక్షలాది రూపాయలు స్నేహా మ్యాక్స్‌లో డిపాజిట్లు, ఇతర రకాల పద్దుల కింద జమ చేశారు.
2008లో ఏర్పాటైన ఈ సంస్థ సభ్యులకు కొన్నాళ్లపాటు వడ్డీలు చెల్లించింది. ఆ తరువాత రానురాను కార్యకలాపాలను తగ్గించుకుంటూ రావడం, చైర్మన్‌గా ఉన్న భాగ్యారావు అందుబాటులో లేకపోవడంతో సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో 87వ వార్డు సిద్ధార్థనగర్‌లో నివాసముంటున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి ఎన్.బాలభాస్కరరావు మరో పది మందితో కలిసి దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంస్థకు చెందిన ఆరుగురిని శుక్రవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అరెస్ట్ అయిన వారిలో గోపాలపట్నానికి చెందిన గూడిపూడి సీతామహాలక్ష్మి, రాజీవ్‌నగర్‌కు చెందిన మాటూరి శ్రీనివాసరావు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఉండవల్లి శ్రీనివాసరావు, సీతమ్మధారకు చెందిన విశ్వేశ్వరరావు, రంగారావు, ధనలక్ష్మి ఉన్నారు. దీనిలో ప్రధాన సూత్రధారి, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి సహా మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.