ఏ పోలీసోడు వస్తాడో.. రమ్మనండి!

Rowdy Sheeter challenges to Visakhapatnam Police - Sakshi

సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణం): ‘ఏ పోలీసోడు వస్తాడో.. రమ్మనండి..!, ఏం పీకుతారో చూస్తాను’అంటూ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ రౌడీషీటర్‌ తన స్నేహితుడి అంతిమ యాత్రలో కత్తితో హల్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాట్సప్‌లో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నగరంలో వైరల్‌ అయింది. దీంతో నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ ఆదేశాల మేరకు టూటౌన్‌ పోలీసులు వన్‌ టౌన్, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. 

ఈ నెల 17న పూర్ణామార్కెట్‌ దరి గాజులవీధికి చెందిన నాయన తరుణ్‌ పుట్టిన రోజు సందర్భంగా కొబ్బరితోటకు చెందిన ఎర్ల వినయ్‌కుమార్‌ అలియాస్‌ బియ్యం, కిల్లి తరుణ్‌కుమార్‌ అలియాస్‌ లడ్డా, పూర్ణామార్కెట్, పండావీధికి చెందిన నుడపురి నవీన్, దుంగా భాస్కర్, కళ్లుపాకలకు చెందిన బత్తిన సాయి, కైలాసపురానికి చెందిన లాలం లోకేశ్వరరావు, ఎల్ల శ్రీనివాసులు, పోసిరెడ్డి పవన్‌కుమార్, గాజులవీధికి చెందిన బాస తేజేష్‌ వేడుకలు నిర్వహించుకున్నారు. 18న తెల్లవారుజామున అరకు వెళ్లారు. మంగళపాలెం వద్ద నాయన తరుణ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు.

తరుణ్‌ తండ్రి మాలవేసి ఉండడంతో 20న శవ పంచనామా చేసి సాయంత్రం అప్పగించారు. మార్చురీ నుంచి ఊరేగింపుగా శవయాత్ర నిర్వహిస్తూ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కొబ్బరితోట వద్ద తరుణ్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఈర్ల వినయ్‌కుమార్‌తో పాటు మిగిలిన వారు మద్యం మత్తులో తరుణ్‌కు జేజేలు పలికారు. ఎర్ల వినయ్‌కుమార్‌ అలియాస్‌ బియ్యం మాత్రం ఓ ఇద్దరి వ్యక్తుల భుజాలపై ఎక్కి మాంసం కత్తిని చేతితో చూపిస్తూ పోలీసులకు సవాల్‌ విసిరాడు. దీంతో అక్కడున్నవారు వీడియో తీసి వాట్సప్‌లో పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌ అయింది.  

చదవండి: (తిరుమల: ఆన్‌లైన్‌లో ప్రత్యేక, వైకుంఠ ద్వార దర్శన టికెట్లు)

నిందితుల అరెస్ట్‌: కత్తులు, మారణాయుధాలతో హల్‌చల్‌ చేస్తూ నగర ప్రజలను భయాందోళనలకు గురి చేసిన 9 మందిని టూటౌన్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. టూటౌన్‌ సీఐ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులుగా వాట్సప్‌లో వైరల్‌ అవుతున్న వీడియోపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు కల్లుపాకలు, పండావీధి, కొబ్బరితోటకు చెందిన రౌడీషీటర్లుగా గుర్తించారు.

కొబ్బరితోటకు చెందిన ఎర్ల వినయ్‌కుమార్‌ అలియాస్‌ బియ్యం, కిల్లి తరుణ్‌కుమార్‌ అలియాస్‌ లడ్డా, పూర్ణామార్కెట్, పండావీధికి చెందిన నుడపురి నవీన్, దుంగా భాస్కర్, కళ్లుపాకలకు చెందిన బత్తిన సాయి, కైలాసపురానికి చెందిన లాలం లోకేశ్వరరావు, ఎల్ల శ్రీనివాసులు, పోసిరెడ్డి పవన్‌కుమార్, గాజులవీధికి చెందిన బాస తేజేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయి, నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వారంతా పోలీసుల విధులకు అడ్డు తగిలారు. నిందితులపై నగరంలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top