
పట్టపగలు ఇద్దరిని హత్య చేసిన రౌడీషీటర్
మద్యం మత్తులో డబ్బుల విషయమై వాగ్వాదం
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): విజయవాడ నగరంలో పట్టపగలు ఇద్దరు వ్యక్తులను ఓ రౌడీషీటర్ హత్య చేశాడు. మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవపడి.. ఇద్దరిని కత్తితో పొడిచి చంపేశాడు. విజయవాడ గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో రౌడీషీటర్ జమ్ము కిశోర్, ఎం.రాజు(37), గాదె వెంకట్(25) మూడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. కిశోర్, రాజు విజయవాడకు చెందిన వారు కాగా.. గాదె వెంకట్ విజయనగరానికి చెందిన వ్యక్తి. బుధవారం మధ్యాహ్నం ముగ్గురూ తమ గదిలో ఫుల్‌గా మద్యం సేవించారు. ఆ సమయంలో డబ్బుల విషయమై ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది.
మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాజు, వెంకట్‌ను కిశోర్ కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రాజు, వెంకట్‌ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకుసమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కిశోర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిశోర్‌పై ఎనిమిది కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 2001లో హత్య కేసుతో తొలిసారి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కిన కిశోర్‌పై అదే ఏడాది రౌడీషీట్ తెరిచినట్లు తెలిపారు.