
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో యూ ట్యూబ్ వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లు పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులు ముగ్గురూ 9వ తరగతి విద్యార్థులే. వ్యసనాలు, జల్సాలకు అలవాటుపడిన మైనర్లు.. రెండు నెలల్లో నాలుగు దొంగతనాలు చేశారు. ఆ ముగ్గురు నుంచి రూ.10 లక్షల 20 వేలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలుర్ల నుంచి చోరీ సొత్తును కొక్కిలిగడ్డ రాము, వల్లూరు సంతోష్ అనే వ్యక్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. జువైనల్ హోంకు తరలించారు. మైనర్ల నుంచి చోరీ వస్తువులు కొనుగోలు చేసిన ఇద్దరికి నోటీసులిచ్చి వదిలేశారు. కాగా, చోరీ చేసిన సొత్తును కొన్నవారికి 41 నోటీసులిచ్చి వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే కొక్కిలిగడ్డ రాము, వల్లూరు సంతోష్‌ను వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి.