అత్తింట ఆమెకు వేధింపులు ఎదురవుతున్నాయనే విషయం.. మాకు తెలిసే సరికి ఆలస్యమైంది. అతను చెయ్యి చేసుకున్న విషయం తెలిసి పంచాయితీ పెట్టాం. క్షమాపణలు చెప్పి.. ఇంకొసారి కొట్టానంటూ బిడ్డ మీద ఒట్టేశాడు. అయినా వేధించడం ఆపలేదు. కడుపుతో ఉందని చూడకుండా గొడ్డు చాకిరీ చేయించాడు. చనిపోయే ముందు కూడా నా సోదరి తన కష్టం చెప్పుకుంది. పగవాడికి కూడా ఇలాంటి చావు రాకూడదు.. కాజల్ కేసులో ఆమె సోదరుడు నిఖిల్ భావోద్వేగంగా జరిగింది వివరించాడు.
అసలేం జరిగింది?.. ఢిల్లీ స్వాట్(Special Weapons and Tactics) కమాండో అయిన కాజల్ చౌద్రి.. జనవరి 22న భర్త అంకుర్ చేతిలో దారుణ హత్యకు గురైంది. అంకుర్ రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్. కాజల్ సోదరుడు నిఖిల్ పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌లో కానిస్టేబుల్. హత్యకు కొన్ని నిమిషాల ముందే ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన నిఖిల్.. సిబ్బందితో హుటాహుటిన అంకుర్ నివాసానికి చేరుకున్నాడు. ఒక పక్క పెద్ద డంబెల్.. మరో పక్క రక్తపు మడుగులో పడి ఉన్న సోదరి.. ఇంకోపక్క అంకుర్, అతని కుటుంబ సభ్యులు నిల్చుని ఉన్నారు.
ఆలస్యం చేయకుండా కాజల్‌ను ఆస్పత్రికి తరలించాడు నిఖిల్. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిందామె. ఆమె మరణించిన కొద్ది గంటలకే అంకుర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షణికావేశంలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడతను. అయితే.. ఈ కేసు వెనుక వరకట్న వేధింపుల కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ప్రేమ వివాహం కాస్త..
అంకుర్, కాజల్ చౌద్రీ పానిపట్‌లో కాలేజీలో చదివే రోజుల్లోనే ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో 2023 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పగింతల సమయంలో అంకుర్ కోరినవన్నీ కాజల్ తల్లిదండ్రులు అప్పగించారు. అయినా కూడా అంకుర్ సంతృప్తి చెందలేదు. కాజల్ ద్వారా తనకు కావాల్సినవన్నీ అత్తింటి నుంచి కానుకల రూపంలో అందుకున్నాడు. ఈ క్రమంలో పిల్లనిచ్చిన మామ దగ్గర విడిగా అప్పు కూడా చేశాడు. ఆపై కాజల్ ఓ బాబుకి జన్మనిచ్చింది. ఆ తర్వాతే ఆమెపై వేధింపులు ఎక్కువయ్యాయి. అయినా ఓపికగా భరించింది.
ఈలోపు కాజల్ మరోసారి గర్భం దాల్చింది. అయినా కూడా భర్త ఆమెతో అన్ని పనులు చేయించేవాడు. ఒకపక్క స్వాట్ డ్యూటీ.. మరోపక్క ఇంటి పనులు. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటికి విషయాలను చేరవేసింది. అప్పటిదాకా ఆ విషయాలేవీ తెలియని ఆమె తల్లిదండ్రులు, సోదరుడు నిఖిల్ షాక్ తిన్నారు. బిడ్డను తీసుకుని పుట్టింటికి వచ్చేయమని బతిమాలారు. ఆమె వినలేదు. చావైనా బతుకైనా భర్తతోనేనని తేల్చేసింది. దీంతో కాజల్ తల్లిదండ్రులు పెద్దలను కూర్చోబెట్టి పంచాయితీ ద్వారా అంకుర్‌కు సర్దిచెప్పించారు.
ఆ రాత్రి ఏం జరిగిందంటే..
ఇంత జరిగినా.. అంకుర్ వేధింపులు ఆపలేదు. జనవరి 22న రాత్రి కాజల్‌తో గొడవపడ్డాడు. 10గం. ప్రాంతంలో అంకుర్ తన బావమరిది నిఖిల్‌కు ఫోన్ చేశాడు. ‘‘ఈ కాల్ రికార్డ్ చేసి పెట్టుకో. ఆధారాంగా పనికొస్తుంది. నీ అక్కను చంపేస్తున్నా’’ అంటూ ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడాడు. దీంతో కంగారుపడ్డ నిఖిల్ శాంతంగా ఉండమని, ఫోన్ తన సోదరికి ఇవ్వమని కోరాడు. అయితే అంకుర్ అరుస్తూ ఫోన్ పెట్టేశాడు. దీంతో నిఖిల్ తన సోదరికి కాల్ చేశాడు. ఆమె మాట్లాడుతున్న.. ఫోన్ లాక్కుని కట్ చేసేశాడు.
మరో ఐదు నిమిషాలకు నిఖిల్ ఫోన్ మళ్లీ మోగింది. ఈసారి ఆమెను చంపేశానని.. ఆస్పత్రికి రావాలని చెప్పాడు. భయపడ్డ నిఖిల్ తన సిబ్బందితో వెస్ట్ ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ఎక్స్‌టెన్షన్‌లోని అంకుర్ కుటుంబం ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే జరగాల్సింది జరిగింది. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. జనవరి 22వ తేదీన రాత్రి 10-10.30 గం. ప్రాంతంలో ఘటన జరిగింది. కాజల్ నాలుగు నెలల గర్భిణి అని, మృతదేహాంపై మరిన్ని గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. కాజల్ బిడ్డను తామే పెంచుకుంటామని.. ఎట్టి పరిస్థితుల్లో అంకుర్ కుటుంబం నీడ కూడా పడనివ్వబోమని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.


