
మహానంది దర్శనానికి వెళ్లొస్తుండగా ప్రకాశం జిల్లా కొమరోలు సమీపంలో దుర్ఘటన
మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు
కారు డ్రైవర్ నిర్లక్ష్యంవల్లే ప్రమాదమని తేన పోలీసులు
సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
కొమరోలు/సాక్షి, అమరావతి/బాపట్ల టౌన్: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు గ్రామం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మహానంది పుణ్యక్షేత్రం దర్శనం అనంతరం తిరుగుముఖంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాలివీ.. బాపట్ల జిల్లా స్టూవర్టుపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది తమ కుటుంబ సమస్యలపై చర్చించుకునేందుకు నంద్యాల జిల్లా డోన్ వెళ్లారు. అక్కడ నుంచి మహానంది వెళ్లి దైవదర్శనం చేసుకుని కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
శుక్రవారం మధ్యాహ్నం అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై తాటిచెర్లమోటు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు కావడంతో వారిని 108లో గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులున్నారు. మృతులను గజ్జెల అంకాలు (40), గజ్జెల భవాని (25), గజ్జెల నరసింహులు (20), గజ్జెల జనార్ధన్ (30), బొచ్చు సన్ని (30), కర్రెద్దుల దివాకర్ (30)లుగా గుర్తించారు.
గాయపడిన చిన్నారుల్లో జీతన్, శిరీష ఉన్నారు. వీరిలో జీతన్ పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించారు. కారు డ్రైవర్ దివాకర్ నిర్లక్ష్యంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. ప్రమాద స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. మృతదేహాలన్నింటిని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వారికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
అత్యంత బాధాకరం: వైఎస్ జగన్
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.