
న్యాయస్థానం ఉత్తర్వులు సిట్ బేఖాతర్
ఏకంగా 13 గంటలకుపైగా విచారణ
అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతూ మానసికంగా ఒత్తిడి
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి పట్ల సిట్ తీరు ఇదీ
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేస్తోంది. గురువారం 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది. రిటైర్డ్ అధికారులైన వారిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11.15 గంటల వరకు విచారణ పేరుతో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉంచడం గమనార్హం.
తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సిట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. తొలిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వారిని విచారించిన సిట్ అధికారులు మరుసటి రోజు గురువారం కూడా రావాలని పేర్కొన్నారు. దీంతో వారిద్దరూ వరుసగా రెండో రోజు గురువారం కూడా విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు.
మళ్లీ మళ్లీ.. అవే ప్రశ్నలు
సిట్ చీఫ్‌గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు.
ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.
వెళ్లిపోవచ్చంటూ.. మళ్లీ రప్పించి..
ఎట్టకేలకు రాత్రి 9.30 గంటల సమయంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నుంచి సెల్ ఫోన్లు తీసుకుని విచారణ ముగిసిందని, వెళ్లవచ్చని సిట్ అధికారులు చెప్పారు. అయితే బయటకు వెళుతున్న వారిని మరోసారి వెనక్కి రప్పించారు. సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్‌బాబు మరోసారి విచారిస్తారని, వేచి ఉండాలని సూచించారు. అయితే రాజశేఖర్‌బాబు పనుల మీద బయటకు వెళ్లినందున ఆయన వచ్చే వరకు వేచి ఉండాలంటూ మరో గంటన్నరకుపైగా కాలహరణం చేశారు.
వారిద్దరినీ మానసికంగా, శారీరకంగా వేధించడమే లక్ష్యంగా వ్యవహరించారు. సిట్ అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో ఎట్టకేలకు రాత్రి 11.15 గంటల సమయంలో విచారణ ముగిసిందంటూ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు పంపించేశారు. ఇలా ఉద్దేశపూర్వకంగా వేధించాలని ముందుగానే రూపొందించుకున్న ప్రణాళికను అమలు చేశారు. శుక్రవారం కూడా మళ్లీ విచారణకు రావాలని వారికి సిట్ అధికారులు సూచించారు.
సిట్ తీరు దారుణం
దర్యాప్తు పేరుతో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ వేధింపులకు గురి చేస్తోంది.రాజ్యాంగం, న్యాయస్థానాల తీర్పులు అంటే ఏమాత్రం లెక్కలేనట్లు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సీనియర్ సిటిజన్లు అయిన వారిద్దరినీ 12 గంటలకు పైగా విచారణ పేరుతో వేధించడం ప్రభుత్వ కుట్రకు తార్కాణం. పౌరుల స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు.
ఈ అక్రమ కేసులో గతంలో ఓ నిందితుడి పట్ల సిట్ అధికారులు ఇలాగే వ్యవహరిస్తే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇంటికి వెళ్లి విచారించాలని, సాయంత్రం 5 గంటల తరువాత విచారించవద్దని ఆదేశించింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. సిట్ అధికారులు రాజకీయ పార్టీ నేతల్లా వ్యవహరించడం సరికాదు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతాం. – మనోహర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు

రాజకీయ వేధింపులు...
రాజకీయ కారణాలతోనే ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ వేధిస్తోంది. కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళతాం. – మొండితోక అరుణ్‌కుమార్, దేవినేని అవినాశ్, వైఎస్సార్‌సీపీ నేతలు
మద్యం విధానంపై కేసు... ముందస్తు బెయిల్‌పై నేడు ‘సుప్రీం’ విచారణ
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఇప్పటికే అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట
బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌పైనా తేలుస్తామన్న ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానానికి సంబంధించి అక్రమ కేసు ఎదుర్కొంటున్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారించనుంది. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్టు చేయరాదని ఆదేశిస్తూ ఈ నెల 13న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు నేడు మరోసారి విచారణకు రానున్నాయి. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఇప్పటికే స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
మరింత మురికిగా మార్చవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు..
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని తెలిసి కూడా అదే రోజు తెల్లవారుజామున బాలాజీ గోవిందప్పను ఆగమేఘాలపై అరెస్ట్ చేశారని గత విచారణ సందర్భంగా ఆయన న్యాయవాది సిద్ధార్థ్ దవే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గోవిందప్ప అరెస్ట్ అక్రమమని నిరూపిస్తామని, దర్యాప్తు సంస్థ తీరును పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. తదుపరి విచారణలో బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి కూడా తేలుస్తామని ప్రకటించింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేయగా... జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం... ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.