
పోలీసు సాక్షిగా గాంధీ సెంటరులోని వైఎస్సార్ విగ్రహాన్ని తొలగిస్తున్న పొక్లెయిన్
మహానేత వైఎస్సార్ విగ్రహం తొలగింపు
కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించి మరీ బరితెగింపు
అధికారుల సహకారంతో కూటమి నేతల కుట్ర
నందిగామ టౌన్: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూటమి నేతలు అధికారుల సహకారంతో గురువారం అర్ధరాత్రి తొలగించారు. క్రేన్‌లు, జేసీబీల సహాయంతో తొలగించిన విగ్రహాన్ని తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయంలో పడేశారు. సుప్రీంకోర్టులోఉన్న కేసు తేలేవరకు ఈ విగ్రహాన్ని తొలగించవద్దన్న హైకోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించి మరీ ఈ దారుణానికి తెగబడ్డారు.
అదే సమయంలో మండలంలోని లింగాలపాడు గ్రామం నుంచి నందిగామ వస్తున్న సర్పంచ్ బొల్లినేని పద్మజ, ఆమె భర్త శ్రీనివాసరావు ఈ దుశ్చర్య గురించి ప్రశ్నించగా వారి కారుపై దాడిచేశారు. వారి ఫోన్లు లాక్కుని ‘మేం టీడీపీ కార్యకర్తలం..మీకు చేతనైంది చేసుకోండి..’ అంటూ దౌర్జన్యం చేసి పంపించేశారు. పట్టణంలోని గాంధీ సెంటరులో 2010లో అప్పటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సారథ్యంలో రెవెన్యూ అధికారుల అనుమతితో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి ఆ విగ్రహం వద్దనే పార్టీ, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సుందరీకరణ పనుల్లో భాగంగా గాంధీ సెంటరులోని జాతీయ, రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించి ప్రభుత్వ ఆస్పత్రి గోడ పక్కన నిర్మించిన ప్లాట్‌ఫాం మీద ఏర్పాటుచేశారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూడా తొలగించాలని అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
ఆ విగ్రహం వలన ఇబ్బందులేమీ లేవని అధికారులు చెప్పటంతో దాన్ని తొలగించాల్సినవసరం లేదని హైకోర్టు ఆదేశాలిచి్చంది. గత ఏడాది కూటమి అధికారంలోకి రాగానే మహానేత విగ్రహాన్ని తొలగించేందుకు కుట్రలు పన్నారు. మున్సిపల్ అత్యవసర సమావేశంలో తీర్మానించి విగ్రహాన్ని తొలగించేందుకు అర్ధరాత్రి యత్నించగా.. వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకుని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణలో.. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించే ఉద్దేశం లేదని మున్సిపల్ అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు.
దీంతో ఆ పిటిషన్‌ను హైకోర్టు క్లోజ్‌చేసింది. 2013కు ముందు ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలలో ఏర్పాటు చేసిన విగ్రహాల తొలగింపునకు సంబంధించిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, అది తేలేవరకు విగ్రహాన్ని తొలగించవద్దని ఆదేశించింది. అయినా కూటమి నేతలు దానిని తొలగించారు.
ఆ విగ్రహాన్ని తొలగించిన చోటే పెడతాం
మరో మూడేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే తొలగించిన స్థానంలోనే రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చెప్పారు. కూటమి నేతలు కుట్రతో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించిన ప్రదేశాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు మొండితోక జగన్మోహనరావు, వైఎస్సార్‌సీపీ తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి చిన్నా తదితరులు పాల్గొన్నారు.