
దుకాణం తొలగింపుతో కన్నీటి పర్యంతమవుతున్న మహిళ
‘ఆపరేషన్ లంగ్స్’ పేరిట బడుగుల ఊపిరి తీస్తున్న కూటమి ప్రభుత్వం
5 రోజుల్లో 3,039 చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపు
ఊహించని కల్లోలంతో బడుగు జీవుల ఆర్తనాదాలు
వైఎస్సార్‌సీపీ, ఇతర సంఘాలు ఉద్యమించినా పట్టించుకోని వైనం
కానరాని విశాఖ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీల నాయకులు
ఎంవీపీ కాలనీ (విశాఖ): ‘ఆపరేషన్ లంగ్స్’ పేరిట విశాఖలో కూటమి సర్కార్ సాగిస్తున్న విధ్వంసం బడుగుజీవుల ఊపిరి తీస్తోంది. దశాబ్దాలుగా చిరు వ్యాపారాలతో కుటుంబాల్ని నెట్టుకొస్తున్న బడుగుల బతుకులపై గుదిబండ మోపుతోంది. ఐదు రోజులుగా విశాఖలో జరుగుతున్న ఈ విధ్వంసకాండ ద్వారా ఇప్పటికే వేలాది కుటుంబాలను రోడ్డు పాల్జేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఈ కర్కశత్వానికి నాంది పలకగా.. టౌన్‌ప్లానింగ్ విభాగం కష్టజీవుల బతుకుల్ని రోడ్డుకీడుస్తోంది.
దీంతో కొన్ని రోజులుగా విశాఖలోని ప్రధాన రహదారులు పేద, బడుగుల ఆర్తనాదాలతో నిండిపోయాయి. దశాబ్దాల జీవనాధారం కోల్పోవడంతో ఒక్కసారిగా తమ జీవితాలు ఛిద్రమయ్యాయంటూ బాధితులు ఎక్కడికక్కడ కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ఎలా బతకాలి దేవుడా..’ అంటూ బరువెక్కిన గుండెలతో కూటమి సర్కారు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
5 రోజుల్లో.. 3,039 దుకాణాల తొలగింపు
ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమానికి జీవీఎంసీ ఈ నెల 19న శ్రీకారం చుట్టింది. నగరంలోని ప్రధాన రహదారుల్లో ఫుట్‌పాత్‌లపైన, వాటిని ఆనుకొని ఉన్న షాపులను, బడ్డీలను తొలగించడం దీని లక్ష్యం. తద్వారా నగర సుందరీకరణ, ట్రాఫిక్ సమస్యలు, స్ట్రీట్ ఫుడ్స్‌తో అనారోగ్య సమస్యలు, భద్రత, పరిశుభ్రత సమస్యలు ఉండవన్నది కూటమి సర్కార్, జీవీఎంసీ అధికార యంత్రాంగం చెబుతున్న మాట. ఇందుకోసం దశాబ్దాలుగా చిరు వ్యాపారాలను నమ్మకొని కుటుంబాల్ని పోషించుకుంటున్న బడుగుల గొంతు కోసేందుకు జీవీఎంసీ నడుం కట్టింది.
బాధితుల ఆర్తనాదాలు, కన్నీటి వెతలు పట్టించుకోకుండా తొలగింపులు కొనసాగిస్తోంది. 19న మొదలైన ఈ ప్రక్రియ సోమవారం మినహా (సీఎం పర్యటనతో) 5 రోజులుగా కొనసాగుతోంది. కేవలం 5 రోజుల్లో నగరంలోని 8 జోన్లలో 3,039 షాపులను జీవీఎంసీ తొలగించింది. దీంతో నగరంలోని వేలాది కుటుంబాల్లోని జీవితాలు ఒక్కసారిగా ఛిద్రమయ్యాయి. నగరంలో ఎటుచూసినా చిరువ్యాపారుల కన్నీటి వ్యథలే దర్శనమిస్తున్నాయి.
పునరావాసంపై శ్రద్ధ కరువు
విశాఖ నగరంలో వేలాది మంది ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరిలో 80 శాతానికి పైగా జీవీఎంసీకి ఏటా పన్నులు చెల్లిస్తున్నారు. దీంతోపాటు జీవీఎంసీ మంజూరు చేసిన స్ట్రీట్ వెండర్ కార్డ్, ట్రేడ్ లైసెన్స్‌లు కలిగి ఉన్నారు. ఈ షాపులు, బడ్డీల తొలగింపు చర్యలు చేపట్టాల్సి వస్తే.. ముందుగానే జీవీఎంసీ వారికి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఆ దిశగా జీవీఎంసీ కనీస చర్యలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం విశాఖలో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. విశాఖ నగరంలో చాలా ఏళ్లుగా హాకర్స్ జోన్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా జీవీఎంసీ పట్టించుకోలేదు.
1998 నుంచి పాన్‌షాప్ ఉంది
ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా కూడలిలో 1998 నుంచి నేను పాన్‌షాపు నిర్వహిస్తున్నాను. దాదాపు 25 ఏళ్లుగా ఇదే నా కుటుంబ జీవనాధారం. జీవీఎంసీ అధికారులు అకస్మాత్తుగా వచ్చి నా షాపును తొలగించేశారు. ఎవరి మెప్పుకోసం, ఎవరి లబ్ధి కోసం కూటమి ప్రభుత్వం ఈ విధ్వంసానికి పూనుకుందో అర్థం కావడం లేదు. బడుగుల జీవితాలతో ఆడుకునే ఈ విధ్వంసకాండను ఆపాలని కోరుకుంటున్నాను. – డాలియ్య, చిరు వ్యాపారి
భర్తలేడు.. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి
నాకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త చనిపోవడంతో చిల్లర దుకాణం పెట్టుకున్నాను. 10 ఏళ్లుగా ఇదే మాకు జీవనాధారం. షాపులోని సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నా కుటుంబ పోషణకు ఎవరు బాధ్యత వహిస్తారు. నా ఆడపిల్లలను ఎలా చదివించుకోవాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ సమాధానం చెప్పాలి. నాలాంటి వేల మందిని రోడ్డుపాల్జేసిన ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. – పార్వతి, చిరు వ్యాపారి