ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి 5జీ సేవలు

Reliance Jio True 5G services in Andhra Pradesh - Sakshi

జియో ట్రూ పేరిట అందుబాటులోకి తీసుకొచ్చిన రిలయన్స్‌  

విజయవాడలో ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ 

తొలుత విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుమల కొండపై 5జీ సేవలు

ఏడాదిలో గిరిజన ప్రాంతాలకు 5జీ సేవలే లక్ష్యం 

విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి హామీ  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్‌ జియో ట్రూ 5జీ పేరిట ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల కొండపై 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఏడాదిలోగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని జియో ప్రకటించింది. విజయవాడలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఈ సేవలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా అమర్‌నాథ్‌ మాట్లాడుతూ అన్ని రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తప్పనిసరిగా మారిందని చెప్పారు. గిరిజన ప్రాంతాలకు త్వరితగతిన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇప్పటికే జియో రాష్ట్రంలో 4జీ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం రూ.26 వేల కోట్లు వెచ్చించగా, 5జీ కోసం రూ.6,500 కోట్లు వ్యయం చేసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్త విస్తరణకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని  ఆయన హామీ ఇచ్చారు.  

ఆర్థికాభివృద్ధిలో డిజిటల్‌ టెక్నాలజీ పాత్ర కీలకం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధిలో డిజిటల్‌ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. దీన్ని సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా రాష్ట్రంలో పలు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ, ఈ–క్రాప్‌ నమోదు విషయాల్లో సాంకేతికతను వివరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్యాబ్‌ల ద్వారా పాఠాలను బోధించడంతోపాటు త్వరలోనే అన్ని క్లాసుల్లో డిజిటల్‌ బోర్డులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా ప్రతి కుటుంబానికి క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు నిర్వహించడంతోపాటు త్వరలో వీడియో కన్సల్టేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగం వల్ల మంచి, చెడు రెండూ ఉన్పప్పటికీ టెక్నాలజీ అభివృద్ధిని అడ్డుకోలేమని పేర్కొన్నారు.

జియో ఏపీ సర్కిల్‌ సీఈవో ఎం.సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ఐదు స్మార్ట్‌ఫోన్లలో మూడింటిలో జియోను వినియోగిస్తున్నారని, రాష్ట్ర డేటా మార్కెట్‌లో 55 శాతం వాటాతో జియో మొదటిస్థానంలో ఉందని చెప్పారు. జనవరి నాటికి తిరుపతి పట్టణానికి, డిసెంబర్‌ నాటికి రాష్ట్రమంతా విస్తరిస్తామని ఆయన తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top