ఆన్‌లైన్‌లోనే ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ 

Registration of hospitals in online itself - Sakshi

ధ్రువపత్రాలన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరిచాకే విచారణ 

నూతన విధానం నేటి నుంచి అమల్లోకి.. 

సాక్షి, అమరావతి: ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్‌ సెంటర్ల రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ఇకపై ఆన్‌లైన్‌ చేయనున్నారు. ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. నాలుగైదు స్థాయిల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తులను పరిశీలించాక, అంతా పక్కాగా ఉంటేనే ఆమోదం లభిస్తుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకూ నర్సింగ్‌హోంలు, స్పెషాలిటీ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్‌ సెంటర్లూ ఇవన్నీ జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉండేవి. వాటికి రిజిస్ట్రేషన్, రద్దు వంటివి జిల్లా అధికారులే చేసేవారు. ఇకపై ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలుకుతోంది. గతంలోలా ఇష్టారాజ్యంగా అనుమతులు తెచ్చుకుని నడిపేందుకు ఇక వీల్లేదు. నర్సింగ్‌ హోంలుగానీ, డయాగ్నస్టిక్స్‌ సెంటర్లుగానీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అవి ఎవరిపేరు మీద ఉన్నాయో వారి వైద్య సర్టిఫికెట్లను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.  

క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్టు పరిధిలోకి ఆస్పత్రులు 
రాష్ట్రంలో సుమారు 2,000 వరకు నర్సింగ్‌ హోంలు, ఆస్పత్రులున్నాయి. వీటి రెన్యువల్‌కు కూడా ఇకపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. ప్రతి ఆస్పత్రీ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. 
► ఇందుకోసం clinicalesstact.ap.go.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
► ప్రాంతం, డాక్టర్లు, ఎన్ని పడకల వివరాలతో పాటు ఫైర్‌ ఎన్‌వోసీ వంటివన్నీ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేయాలి. 
► రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఎలాంటి లావాదేవీలైనా ఈ వెబ్‌సైట్‌ ద్వారానే జరపాలి.  
► దరఖాస్తులను కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కార్యాలయంలో పరిశీలిస్తారు.  
► అన్నీ బాగున్నాయనుకుంటే జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో ఆస్పత్రి పరిశీలనకు కమిటీని వేస్తారు.  
► కమిటీ నివేదికను కూడా ఈ వెబ్‌సైట్‌కే అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

గర్భస్థ లింగ నిర్ధారణ నిర్మూలన చట్టం పరిధిలోకి డయాగ్నస్టిక్స్‌ సెంటర్లు.. 
రాష్ట్రంలో చిన్నవి, పెద్దవి కలిపి 1,000 వరకు డయాగ్నస్టిక్స్‌ సెంటర్లున్నాయి. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్‌ వంటి నిర్ధారణ చేసే సెంటర్లన్నీ గర్భస్థ లింగ నిర్ధారణ నిర్మూలన చట్టం పరిధిలోకొస్తాయి. వీటి రిజిస్ట్రేషన్‌కు  pcpndt.ap.gov.in వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top