జేఈఈ మెయిన్‌కు రికార్డు స్థాయిలో హాజరు  | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్‌కు రికార్డు స్థాయిలో హాజరు 

Published Sun, Feb 4 2024 4:47 AM

Record attendance for JEE Main - Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయి­న్‌ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన జేఈఈ తొలి సెషన్‌ పేపర్‌–1 (బీఈ/బీటెక్‌) పరీక్ష 95.80 శాతం, పేపర్‌–2 (బీఆర్క్‌/బీప్లానింగ్‌) పరీక్ష 75 శాతం మంది రాయడం విశేషం.

చరిత్రలో ఎన్నడూ లేనంతంగా ఈసారి జేఈఈ మెయిన్‌కు 12,31,874 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 8,24,945 మంది పురుషులు, 4,06,920 మంది మహిళలు, 9 మంది థర్డ్‌ జెండర్‌ ఉన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 27 శాతం ఎక్కువ. తాజాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అత్యధికంగా 12,25,529 మంది పరీక్షకు హాజరయ్యారు.  

291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలు..
ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కు అత్యధికంగా దరఖాస్తులు రావడంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష కేంద్రాలు పెంచింది. సెషన్‌–1 కోసం 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 21 పరీక్ష కేంద్రాలు విదేశాల్లో ఉండటం విశేషం.

దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్‌ సిటీ, కౌలాలంపూర్, లాగోస్‌/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్‌లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్‌ డీసీతో పాటు ఈ ఏడాది తొలిసారిగా అబుదాబి, హాంకాంగ్, ఓస్లో నగరాల్లో జేఈఈ మెయిన్‌ పరీక్షను నిర్వహించారు.

రెండో సెషన్‌ తేదీల్లో మార్పు..
జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ మార్పు చేసింది. తొలుత ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్యలో పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ వాటిని ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్యలోకి మార్చింది. మార్చి 2 అర్దరాత్రి 11.50 గంటల వరకు సెషన్‌–2 కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలోనే రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు రెండో సెషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థి సెషన్‌లో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్‌టీఏ హెచ్చరించింది.

రెండు సెషన్లలో రాస్తే.. ఎందులో అత్యధిక స్కోర్‌ వస్తుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ, రిజర్వేషన్లు ఆధారంగా టాప్‌ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. వీరు పోగా మిగిలిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌ఐటీ (ప్రభుత్వ నిధులతో పనిచేసే సాంకేతిక విద్యా సంస్థలు)ల్లో సీట్లను భర్తీ చేస్తారు.

Advertisement
Advertisement