
అనంతపురంలో రేషన్ డీలర్ల సంఘం నాయకుల దందా
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పుట్టినరోజున ఫ్లెక్సీల కోసమంటూ వసూళ్లు
ఒక్కో డీలర్ నుంచి రూ.5 వేలు డిమాండ్
ఇవ్వకుంటే దుకాణం తీయించేస్తామని బెదిరింపులు
వంద షాపుల నుంచి రూ.ఐదు లక్షలు వసూలుకు ప్లాన్
అనంతపురం అర్బన్: అధికార పార్టీ నాయకుల్లో కొందరి ‘రూటే’ సెప‘రేటు’! డబ్బులు దండుకునే విషయంలో వారికి తరతమ భేదం ఉండదు. తాజాగా ఇలాంటి తంతు రేషన్ డీలర్ల విషయంలో చోటు చేసుకుంది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పుట్టినరోజును పురస్కరించుకుని రేషన్ డీలర్ల సంఘం నాయకులు వసూళ్లకు తెరలేపారు. డీలర్ల తరఫున ఎమ్మెల్యేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదామని, ఇందులో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటుకు ఒక్కొక్క డీలర్ రూ.5 వేల చొప్పున ఇవ్వాలని డీలర్ల సంఘానికి చెందిన కొందరు నాయకులు డిమాండ్ చేశారు.
అనంతపురం అర్బన్ పరిధిలో మొత్తం 136 చౌక డిపోలు ఉన్నాయి. ఇందులో కనీసం వంద షాపుల నుంచి రూ.5 లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. తాము చెప్పినంత ఇవ్వకపోతే ఎమ్మెల్యేకు చెప్పి దుకాణం తీయించేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు పలువురు డీలర్లు ఆవేదన చెందుతున్నారు.
దుకాణం ఉండాలంటే రూ.లక్ష!
ఎమ్మెల్యే బర్త్‌డే పేరిట వసూళ్ల సంగతి ఒక ఎత్తయితే... డీలర్‌షిప్ మీకే కొనసాగాలంటే రూ.లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూండడం మరొక ఎత్తు. లేదంటే ఎమ్మెల్యేకు చెబుతామని, స్టోరు వేరే వారికి ఇప్పిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో భయపడిన కొందరు డీలర్లు ఇప్పటికే రూ.లక్ష చొప్పున, మరికొందరు రూ.50 వేలు, రూ.60 వేలు, రూ.75 వేలు..ఇలా చెల్లించుకున్నట్లు తెలిసింది. స్వయాన డీలర్ల సంఘం నాయకులే కొందరు దళారుల అవతారమెత్తి ఎమ్మెల్యే పేరిట వసూళ్లకు తెగబడడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు.
ముడుపుల రూపంలో సమర్పించుకున్న డబ్బును సర్దుబాటు చేసుకునేందుకు బియ్యం, ఇతర సరుకులను ‘పక్కదారి’ పట్టించక తప్పడం లేదని కొందరు డీలర్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే పేరిట సదరు నాయకులు ఇప్పటికే పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశారని, తాము ఏమి చేసినా ఎమ్మెల్యేకు చెప్పే చేస్తామంటుండడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదని వాపోతున్నారు. బయటికు చెబితే ఏ సమస్యల్లో ఇరికిస్తారోనని పలువురు డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.