తీరంలో అలజడి | Rain forecast for South Coast Andhra Rayalaseema for three days | Sakshi
Sakshi News home page

తీరంలో అలజడి

Jan 30 2023 5:16 AM | Updated on Jan 30 2023 5:16 AM

Rain forecast for South Coast Andhra Rayalaseema for three days - Sakshi

తూపిలిపాళెం వద్ద ఎగసిపడుతున్న సముద్రపు అలలు

సాక్షి, విశాఖపట్నం/వాకాడు (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా వాకాడు తీరంలో భీకర శబ్దాలతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు భూమధ్యరేఖ ప్రాంతం మీదుగా ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫిరిక్‌ స్థాయి వరకు విస్తరించి ఉంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది.

అనంతరం నైరుతి బంగాళాఖాతం మీదుగా నెమ్మదిగా పయనిస్తూ ఫిబ్రవరి 1 నాటికి శ్రీలంక తీరానికి చేరుకుంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది.

అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పొగ మంచు ఏర్పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. కాగా, ఆదివారం వేకువజామున రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆర్‌.అనంతపురం (శ్రీసత్యసాయి)లో 9.6, ముత్తుకూరు (చిత్తూరు)లో 10, నిమ్మనపల్లె (అన్నమయ్య)లో 10.9, వల్లెవీడు (తిరుపతి)లో 11.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ముందుకొచ్చిన సముద్రం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్ర­భా­వంతో ఆదివారం వాకాడు మండలం తూపి­లి­పాళెం సముద్ర తీరంలో ఈదురు గాలులు వీస్తుండగా.. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడు­తు­న్నాయి. దీంతో సముద్రం దాదాపు 5 మీటర్ల వ­రకు ముందుకు చొచ్చుకొచ్చి తీరాన్ని తాకుతోంది. సముద్రంలో అలలు 5 అడుగుల మేర ఎగ­సిపడటం, బోట్లు నిలబడే పరిస్థితి లేకపోవడంతో తిరుపతి జిల్లాలోని చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో సముద్రంలో వేటకు వెళ్లడంపై నిషేధం విధించారు.  

Advertisement
 
Advertisement
Advertisement