
వైఎస్‌ఆర్ కడప జిల్లా: చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండేళ్ళకు కలిపి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రూ.40 వేలని అన్నారు. కానీ ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన దానిలో మొదటి విడత కింద ఇస్తున్నది కేవలం రూ.5 వేలు మాత్రమే, దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసాను ప్రకటించి రైతులకు పెట్టుబడి సాయంను అందించడం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రారంభించాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాని పేరు అన్నదాత సుఖీభవ అంటూ మార్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రతి రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా ఈ రాష్ట్ర ఖజానా నుంచి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ రైతుల కోసం రైతుభరోసా కాకుండా ఏమైతే ఇచ్చారో అవి కూడా కొనసాగిస్తామని కూడా చెప్పారు.
చిత్తశుద్ది ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
ఈ రోజు అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద దర్శిలో సీఎం చంద్రబాబు చేతుల మీదిగా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఈ పథకం కింద ప్రతి రైతుకు రాష్ట్ర ఖజానా నుంచి రూ.20 వేలు ఇస్తామని చెప్పి, ఎందుకు రూ.14 వేలు మాత్రమే ఇస్తున్నారో చంద్రబాబు చెప్పాలి. మిగిలిన ఆరు వేల రూపాయలను ఎందుకు ఎగ్గొడుతున్నారో సమాధానం చెప్పాలి. గత ఏడాది ఇవ్వాల్సిన రైతు పెట్టుబడి సాయం రైతు భరోసా రూ.20 వేలు ఎందుకు ఇవ్వలేదు..? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అయిదేళ్ళపాటు రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందించాం. కానీ కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఎందుకు ఎగ్గొట్టారో చెప్పాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 53 లక్షల మంది అర్హులైన రైతులను గుర్తించి ఏటా రూ.13,500 చొప్పున రైతుభరోసాను అందించారు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 46 లక్షల మంది రైతులకే ఈ పథకాన్ని ఇస్తోంది. అంటే దాదాపు 7 లక్షల మంది రైతులకు కోత విధించారు.
కూటమి ప్రభుత్వం రైతులకు చేసిన మేలు ఏదీ..?
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి ఇప్పటి వరకు రైతులకు చేసిన మేలు ఏమిటో చెప్పాలి. 2024 నుంచి రబీ, ఖరీఫ్ సీజన్‌లలో పంట నష్టాలను చెల్లించారా..? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైఫరీత్యాల వల్ల జరిగే ప్రతి పంట నష్టానికి కేవలం 30 రోజుల్లో పరిహారాన్ని చెల్లించాం. ఉచిత పంటల బీమా కింద రైతుల పక్షాన ప్రీమియంను ప్రభుత్వమే భరించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పధకాన్నే ఏత్తేసింది. కనీసం రైతులే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకున్నా కూడా వారికి జరిగిన పంటనష్టం బీమాను కూడా చెల్లించకపోవడం దారుణం కాదా..? విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించారా..? కనీసం వ్యవసాయ పనిముట్లను అయినా అందుబాటులోకి తెచ్చారా.? వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కడైనా గిట్టుబాటు ధర కల్పించారా.? వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను సక్రమంగా నిర్వహిస్తున్నారా.? ఎందుకు రైతులు గిట్టుబాటు రేటు కోసం రోడ్డెక్కుతున్నారు.? ఎందుకు రాష్ట్రంలో మళ్ళీ రైతు ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి.