ముఖ్యమంత్రి గురించి ఇష్టమొచ్చినట్లు రాస్తారా? | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి గురించి ఇష్టమొచ్చినట్లు రాస్తారా?

Published Sat, Dec 9 2023 5:29 AM

Pressure is increasing on courts with mini trial - Sakshi

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష నిమిత్తం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంప్‌ కార్యాలయాల ఏర్పాటుకు ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్‌ల కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 2283ని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన రాజధాని రైతులు అందులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్లు రాయడంపై అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డికి కులాన్ని ఆపాదించడాన్ని తప్పుపట్టారు.

అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం దాఖలు చేసిన ఈ రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ.. మీడియా దృష్టిని ఆకర్షించడానికే పిటిషనర్లు ఇలా చేస్తున్నారన్నారు. ఇలా ఏది పడితే అది రాసి పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదని, ఇలాంటి వ్యాజ్యాలను విచారించడానికి వీల్లేదని అన్నారు.

వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలతో నిర్లక్ష్యపూరితంగా దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలకు విచారణార్హత లేదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందని వివరించారు. ఇలా చేయడం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని చెప్పారు.  ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వ్యవహారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నందున, ఈ వ్యాజ్యం కూడా ఆ ధర్మాసనానికే వెళ్లాల్సి ఉంటుందన్నారు.

ఈ విషయం స్పష్టంగా తెలిసి కూడా రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం ‘ఫోరం షాపింగ్‌’ కిందకే వస్తుందని వివరించారు. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకోవాలని మిమ్మల్ని (జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లును) అడగటంటంలేదని, వ్యాజ్యం ధర్మాసనం ముందుకు మాత్రమే వెళ్లాలని చెబుతున్నామని చెప్పారు. ఒకవేళ విచారణ నుంచి మిమ్మల్ని తప్పుకోవాలని కోరితే (రెక్యూజ్‌) దాన్ని రాతపూర్వకంగానే కోరతామన్నారు. రాజధాని విషయంలో పిటిషనర్ల వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలనే చూడాలన్నారు. 

ఉద్దేశపూర్వకంగానే రిట్‌ పిటిషన్‌ వేశాం 
అంతకు ముందు పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. తాము ఉద్దేశపూర్వకంగానే రిట్‌ పిటిషన్‌ వేశామన్నారు. ఈ వ్యవహారంలో తమ వ్యక్తిగత ప్రయోజనాలు, ఆస్తి హక్కు ముడి పడి ఉన్నాయని, అందువల్లే పిల్‌ కాకుండా రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశామని చెప్పారు. కార్యాలయాల తరలింపుపై గతంలో పిల్‌ దాఖలు చేసిన పిటిషనర్లు వేరని, వారికీ ప్రస్తుత వ్యాజ్యంలోని పిటిషనర్లకు సంబంధం లేదని తెలిపారు.

రాజధాని విషయంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పు అమల్లో ఉందని, దాని ప్రకారం కార్యాలయాలను రాజధాని నుంచి తరలించడానికి వీల్లేదన్నారు. ఆ తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 2283 జారీ చేసిందన్నారు.  క్యాంప్‌ ఆఫీస్‌ అంటే టెంట్‌ (గుడారం)లో ఉండాలని, బంగళాల్లో ఉండకూడదని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.  

Advertisement
 
Advertisement