కారుణ్య నియామకం హక్కు కాకున్నా.. దరఖాస్తును న్యాయబద్ధంగా పరిశీలించాలి
న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు
సాక్షి, అమరావతి: కారుణ్య నియామకం అనేది హక్కు కానప్పటికీ, దరఖాస్తుదారుడి అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించడానికి వీల్లేదని, న్యాయబద్ధంగా పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కారుణ్య నియామకంపై అధికారులు నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు యాంత్రికంగా కాకుండా, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది.
దరఖాస్తు చేయడంలో జాప్యం ఉందన్న కారణంతో కారుణ్య నియామకాన్ని తిరస్కరించడానికి వీల్లేదంది. ఐదేళ్ల జాప్యం అన్నది అసాధారణ జాప్యం కానే కాదంది. తనకు, తన తండ్రికి రైల్వే శాఖలో కారుణ్య నియామకానికి సంబంధించిన నిబంధనల గురించి తెలియదని పిటిషనర్ చెప్పిన దాంతో హైకోర్టు ఏకీభవించింది.
కారుణ్య నియామకం కోసం పిటిషనర్ నారాయణమ్మ పెట్టుకున్న దరఖాస్తును మూడు నెలల్లో పరిగణనలోకి తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
అసలు కేసు ఏంటంటే..!
విజయనగరం జిల్లా, కొత్తవలస గ్రామానికి చెందిన బి.రాములు రైల్వేశాఖలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేసేవారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్యంతో గ్యాంగ్‌మెన్‌గా ఉద్యోగం చేసే పరిస్థితిలో లేకపోవడంతో 1999లో రాములుకు రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఉద్యోగాన్ని (డీ కేటగిరైజేషన్) ఇవ్వదలిచారు. అయితే రాములు 2000లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. రూ.1895లను పెన్షన్‌గా, రూ.1.50 లక్షలను పీఎఫ్, గ్రాట్యుటీ కింద రైల్వే అధికారులు చెల్లించారు.
ఇదిలా ఉండగా 2006లో రాములు కుమార్తె నారాయణమ్మ కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకున్నారు. రాములు కుటుంబ ఆరి్థక ఇబ్బందులను గుర్తించిన డివిజినల్ రైల్వే అధికారులు కారుణ్య నియామకం కోసం నారాయణమ్మ దరఖాస్తును ఉన్నతాధికారులకు సిఫారసు చేయగా, వారు దానిని తిరస్కరించారు. నిబంధనల ప్రకారం ఐదేళ్ల లోపు దరఖాస్తు చేయలేదంటూ నారాయణమ్మ దరఖాస్తును వారు తోసిపుచ్చారు. దీనిపై ఆమె కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు.
క్యాట్ ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ధర్మాసనం అధికారులు నారాయణమ్మ దరఖాస్తును ఏకపక్షంగా తిరస్కరించడాన్ని తప్పుబట్టింది. ఉద్యోగి మరణం.. ఆ కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదని వ్యాఖ్యానించింది. క్యాట్ తీర్పును రద్దు చేసింది. నారాయణమ్మ దరఖాస్తును మూడు నెలల్లో పరిగణనలోకి తీసుకోవాలని రైల్వే అధికారులను ధర్మాసనం ఆదేశించింది.


