తిరుపతి సాక్షి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 3.25 గంటలకు రాష్ట్రపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుండి రోడ్డు మార్గాన తిరుమలకు బయిలుదేరి 3.55 గం.లకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అక్కడి నుండి నేరుగా శ్రీ పద్మావతి అతిధి గృహానికి చేరుకొని రాత్రి అక్కడే బసచేస్తారు. 21వ తేదీ శుక్రవారం 9.30గంటలకు శ్రీవరాహ స్వామిని దర్శించుకొని వెనువెంటనే 10 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం అక్కడి నుండి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లి హైదరాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు.
కాగా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలకు వెళ్లారు. స్వాముల సంప్రదాయం ప్రకారం నల్లదుస్తులు ధరించి ఇరుముడితో 18 మెట్లు ఎక్కారు. దీంతో శబరిమల క్షేత్రానికి వెళ్లిన మెుదటి మహిళా రాష్ట్రపతిగా ఆమె రికార్డు సృష్టించారు. మెుత్తంగా రాష్ట్రపతులలో 1970 దశకంలో వీవీగిరి మాత్రమే అయ్యప్పదర్శనం చేసుకున్నారు.


