మైనింగ్ ప్రాంతంలో మందీమార్బలంతో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
క్వార్జ్ గనుల్లో వాటాల కోసం కొత్త వేషాలు
సైదాపురం మైనింగ్‌పై రాజకీయ మాఫియా దాడి
సిండికేట్ వాటాలకు అదనంగా షాడో ఎమ్మెల్యే డిమాండ్
టన్నుకు రూ.3 వేలివ్వాల్సిందేనని పట్టు
గనుల యజమానులు వినకపోవడంతో రంగంలోకి ఎమ్మెల్యే
తనిఖీల పేరుతో రంగంలోకి రెవెన్యూ అధికారులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: సైదాపురం కార్జ్ గనుల్లో కొత్త కలకలం కనిపిస్తోంది. ప్రభుత్వ ముఖ్య నేత కనుసన్నల్లో నడిచే మైనింగ్ సిండికేట్‌కి ఇచ్చే వాటాలకు అదనంగా తనకూ ముట్టజెప్పాలని ఓ ఎమ్మెల్యే హూంకరించడం దోపిడీ ఏ స్థాయికి చేరుకుంటున్నదో తెలియజేస్తోంది. ఏడాదిన్నరగా అక్రమ మైనింగ్ జరుగుతుంటే... ఇప్పుడే గుర్చొచ్చినట్లు అధికారులను, మందీ మార్బలాన్ని వెంటేసుకుని సదరు ఎమ్మెల్యే తనిఖీలు జరిపిస్తుండడం చూసి అంతా విస్తుపోతున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం క్వార్జ్ గనుల్లో వాటాల కోసం ఇలా రాజకీయ మాఫియా దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గనుల యజమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇదంతా వాటాల కోసం కొత్త వేషాలు అంటూ అధికార పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కారు వచ్చాక మైనింగ్ లీజుల కేటాయింపు నుంచి, వాటాల కోసం ఎవరికివారు రచ్చకెక్కారు. అనుమతులిచి్చన ప్రభుత్వ పెద్దలు 8 నెలల్లోనే మళ్లీ వాటాల కోసం గనుల యజమానులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఒప్పందాలకు తలొగ్గడంతో అనుమతులు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో మైనింగ్‌లో 7 భూగర్భ, 140 ఓపెన్ కార్జ్ గనులు ఉన్నాయి. వీటిల్లో దొరికే మైకా కార్జ్జ్‌కు చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం రాగానే గనులను హస్తగతం చేసుకుని నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ వేమిరెడ్డి, ఆర్‌వీఆర్ కంపెనీలకు కట్టబెట్టింది. ముఖ్య నేతకు నెలకు రూ.30 కోట్లు ఇచ్చే ఒప్పందంతో మైనింగ్ ధారాదత్తం చేశారు.
ఆ కంపెనీ సిండికేట్‌గా ఏర్పడి వారి కనుసన్నల్లోనే మైనింగ్ నడిపి వారు నిర్ణయించిన ధరకే ముడిసరుకు ఇవ్వాలని పట్టుబట్టారు. కొందరు గనుల యజమానులు ఒప్పుకోకపోవడంతో ఏడాది పాటు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ మైనింగ్ నిలిపివేశారు. కరెంట్ బిల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితి రావడంతో వారు చివరకు సిండికేట్‌కు దాసోహమయ్యారు. అనుమతులు తీసుకుని సరుకు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే నెల్లూరుకు చెందిన ఓ నేత అనధికారికంగా మైనింగ్ చేయడం గతంలో పెద్ద దుమారం రేపింది. గూడూరు, సైదాపురంలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోంది. దీనికి పాల్పడుతున్నవారు సిండికేట్‌లో ముఖ్యులు కావడంతో అడ్డు చెప్పేవారు లేకుండా పోయారు.
సైదాపురం సిండికేట్ ప్రభుత్వ ముఖ్యనేత కనుసన్నల్లో ఏర్పాటైంది. నెలకు ఆయనకు రూ.కోట్లల్లో డబ్బు వెళ్తోంది. ఎవరి వాటాలు వాళ్లకు సరఫరా అవుతున్నాయి. అయినా చాలదన్నట్లు స్థానిక ఎమ్మెల్యే ఇలా అదనంగా వాటా డిమాండ్ చేయడం చూస్తుంటే వీళ్ల దోపిడీ ఏ స్థాయికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మాకూ టన్నుకు రూ.3 వేలివ్వండి
టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌దారుల నుంచి టన్నుకో రేటు పెట్టి వసూలు చేస్తున్నారు. అన్ని అనుమతులున్న గనుల యజమానులు మాత్రం ఎంతో కొంత ఇచ్చి సరిపెట్టారు. మైనింగ్ చేసి వచ్చే ముడిసరుకు సిండికేట్ నిర్ణయించిన రేటుకు ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యేకు ఎందుకు ఇవ్వాలనేది యజమానులు వాదన. వెంకటగిరి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న వ్యక్తికి క్వార్ట్ ్జ గనులు యజమానుల తీరు నచ్చలేదు.
స్థానిక ఎమ్మెల్యేను కాదని సిండికేట్‌కు ఎందుకివ్వాలని, తమకూ టన్నుకో రూ.3 వేలు వంతున లెక్క కట్టాలని షాడో ఎమ్మెల్యే ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దీనికి వారు ససేమిరా అనడంతో ఆగ్రహం చెందిన షాడో ఎమ్మెల్యే అసలు ప్రజాప్రతి«నిధిని రంగంలోకి దింపారు. జిల్లా స్థాయి అధికారులతో రెండు రోజుల క్రితం సైదాపురంలో తనిఖీల పేరుతో ఎమ్మెల్యే రెండు గనుల్లో హడావుడి చేశారు.
భూముల వివరాలు తమ ముందు ఉంచాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కేటాయింపులో తప్పు చేశారంటూ నిందారోపణలు మొదలుపెట్టారు. 18 నెలల నుంచి అక్రమ మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోనివారు ఇప్పుడు తనిఖీల పేరుతో హల్‌చల్ చేస్తుండడం చూసి అంతా విస్తుపోతున్నారు.


