
మాజీమంత్రి నల్లపరెడ్డి ఇంట్లో విధ్వంసంపై ఇప్పటికీ కేసు నమోదు చేయని పోలీసులు
ప్రశాంతిరెడ్డి ఫిర్యాదుతోనల్లపరెడ్డిపై ఆగమేఘాల మీద అక్రమ కేసు నమోదు
పోలీసుల తీరుపై మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ మూకలు, రౌడీలు దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోతూ.. ఆస్తులు ధ్వంసం చేస్తున్నా ఇక్కడి పోలీసులు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై ఫిర్యాదులు వస్తే మాత్రం ఆగమేఘాలపై కేసులు నమోదు చేస్తున్నారు.
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు దాడికి తెగబడి.. విధ్వంసం సృష్టించి 48 గంటలు గడిచినా కేసు నమోదులో తాత్సారం చేస్తున్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదు అందిందే తడవుగా అక్రమ కేసు నమోదు చేయడం వారి ‘పచ్చ’పాత ధోరణికి అద్దం పడుతోంది.
ఎమ్మెల్యే ప్రశాంతి పాత్ర ఉండటం వల్లే..
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాలతో సోమవారం రాత్రి టీడీపీ రౌడీమూకలు మారణాయుధాలతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆయనను చంపేస్తామని కేకలు వేస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అదే రోజు రాత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి డీఎస్పీ పి.సింధుప్రియకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ఈ ఘటన వెనుక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి పాత్ర ఉండటంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతోనే సరిపెట్టారు. దాడి జరుగుతున్న సమయంలోనే పోలీసులు నల్లపరెడ్డి ఇంటికి చేరుకున్నారు. రౌడీమూకల ధ్వంసరచనను అడ్డుకునే అవకాశం ఉన్నప్పటికీ ఏమీ చేయకుండా వేడుక చూశారు. టీడీపీ మూకలు దర్జాగా వెళ్లిపోతున్నప్పటికీ వారిలో ఒక్కరిని కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యే ప్రశాంతి ముఖ్య అనుచరులు దగ్గరుండి దాడులకు పురిగొల్పుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నా.. సాక్ష్యాధారాలను వైఎస్సార్‌సీసీ నేతలు బయటపెట్టినా ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అయితే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యా దు చేసిన వెంటనే ప్రసన్నకుమార్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం, మరికొందరు నేతలను కేసులో ఇరికించేందుకు పలు సెక్షన్లు పెట్టడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. దీని పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో చట్టపరంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధమవుతున్నారు.