సాక్షి, పుట్టపర్తి: ఓ కారు.. ఇద్దరు వ్యక్తులు.. రూ.కోట్ల నగదు.. పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే వెళ్లి స్వా«దీనం చేసుకున్నారు. కానీ విషయం బయటకు చెప్పలేదు. ఎలాగోలా బయటకు వచ్చి హాట్ టాపిక్ అయ్యింది. దీంతో సోమవారం పెనుకొండ సీఐ రాఘవన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పెనుకొండ సమీపంలోని ఓ ప్రాంతంలో ధ్వంసమైన కారులో నుంచి రూ.1.20 కోట్ల నగదు స్వా«దీనం చేసుకున్నామని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆ డబ్బు ఎవరిదన్నది మాత్రం తెలపలేదు.
అన్నీ అనుమానాలే..
పోలీసులు స్వా«దీనం చేసుకున్న డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశాన్ని పోలీసులు వెల్లడించలేదు. రూ.20 కోట్ల వరకు కారులో ఉన్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. దీనిపైనా క్లారిటీ ఇవ్వడం లేదు. ఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారన్నది అనుమానాలకు తావిస్తోంది. డబ్బు బడా వ్యాపారవేత్తలదా? రాజకీయ నాయకులదా అన్నది వారం రోజుల తర్వాత కూడా చెప్పలేకపోతున్నారు. కనీసం తమ అదుపులో ఉన్న వారెవరన్న విషయాన్నీ మీడియాకు వెల్లడించలేదు.
గోరంట్ల పోలీసులకు సమాచారం.. ‘కియా’ స్టేషన్‌లో కేసు
పెనుకొండ శివారులోని జాతీయ రహదారిపై ద్వంసమైన కారులో నగదు పట్టుబడినట్లు సోమవారం పెనుకొండ సర్కిల్ కార్యాలయంలో సీఐ రాఘవన్ మీడియాకు తెలిపారు. తొలుత పెనుకొండ సమీపంలో ధ్వంసమైన ఓ కారులో డబ్బు ఉందంటూ గోరంట్ల పోలీసులకు సమాచారం అందిందని, అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని డబ్బు స్వా«దీనం చేసుకున్నారని, అయితే అది కియా పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో ఇక్కడ కేసు నమోదు చేశారని చెబుతున్నారు. ఇదంతా నిజమే అయితే ఆ డబ్బు ఎవరిది? పోలీసుల అదుపులో ఉన్న ఆ ఇద్దరు ఎవరన్నది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక కారులోని వ్యక్తులే సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగైతే కియా స్టేషన్ పోలీసులకు లేదా పెనుకొండ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా గోరంట్ల పోలీసులకు ఎందుకిచ్చారు? ఈ అంశంలో గోరంట్ల పోలీసుల ప్రమేయం ఏమిటన్నది ప్రశ్నగా మిగిలింది.
హవాలా డబ్బేనా?
పెనుకొండ పరిధిలో ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుబడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంపకాల్లో తేడా కారణంగా హవాలా మనీ గురించి తరలిస్తున్న వారే బయట పెట్టారా? లేక దారిదోపిడీదారులు వెంబడించి ఎత్తుకెళ్లారా? అనేది సస్పెన్స్‌గా మారింది.
విచారణ చేస్తున్నాం
ఈ నెల 5న సూరత్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారును స్వా«దీనం చేసుకుని..ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కియా పోలీస్ స్టేషన్ పరిధిలో విచారణ చేపట్టాం. డబ్బు ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. లోతుగా విచారణ చేసి త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం. కారులో డబ్బు తీసుకెళ్తుండగా.. కొందరు దుండగులు దారి కాచి దోపిడీ చేసి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఇద్దరు వ్యక్తులు గోరంట్ల పోలీసులను ఆశ్రయించగా.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ధ్వంసమైన కారుతో పాటు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు విచారణ చేయగా.. డబ్బు తమదేనని చెబుతున్నారు. అయితే అంత డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దానిపై విచారణ చేస్తున్నాం.’
– రాఘవన్, పెనుకొండ సీఐ


