చంపిందేమో జూలకంటి అనుచరులు.. కేసేమో పిన్నెల్లిపై! | Police register illegal case against Pinnelli brothers | Sakshi
Sakshi News home page

చంపిందేమో జూలకంటి అనుచరులు.. కేసేమో పిన్నెల్లిపై!

May 26 2025 5:20 AM | Updated on May 26 2025 9:32 AM

Police register illegal case against Pinnelli brothers

బరితెగించి నీచ రాజకీయాలు చేస్తున్న కూటమి సర్కారు

గుండ్లపాడు జంట హత్యల నిందితులు టీడీపీ వారేనన్న పల్నాడు ఎస్పీ 

టీడీపీలోని తమ ప్రత్యర్థి వర్గమే చంపిందన్న ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అల్లుడు 

హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడిదే 

కానీ ఈ కేసులో పిన్నెల్లి పేరును ఇరికించిన జూలకంటి 

ఆయన ఒత్తిడితోనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు 

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: టీడీపీలోని ఆధిపత్య పోరుతోనే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జంట హత్యలు జరిగాయని సాక్షాత్తూ జిల్లా ఎస్పీ ప్రకటించినా.. ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అల్లుడు వెల్లడించినా కూడా కూటమి సర్కార్‌ బరితెగించి నీచ రాజకీయాలు చేస్తోంది. కళ్లెదుటే వాస్తవాలు కనిపిస్తున్నా.. రాజకీయ కక్షతో వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది.  

జూలకంటి ఫ్లెక్సీతో మొదలైన గొడవ..  
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్య అనంతరం గ్రామ టీడీపీ నాయకత్వం జవిశెట్టి వెంకటేశ్వర్లు చేతిలోకి వెళ్లింది. ఇది టీడీపీ నాయకుడు తోట వెంకట్రామయ్య వర్గానికి ఇబ్బందికరంగా మారింది. కొంతకాలంగా ఇరువర్గాలు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి జన్మదినం సందర్భంగా తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీను గత నెలలో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్న వీధిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. 

తన వర్గంతో కలిసి శ్రీనుపై దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టాడు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న తోట వెంకట్రామయ్య పక్కా కుట్రతో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావును కారుతో ఢీకొట్టి పాశవికంగా హత్య చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడైన తోట వెంకట్రామయ్యదే. ఆ కారు వెనుక జేబీఆర్‌ పేరుతో పసుపు రంగులో పెద్ద స్టిక్కర్‌ సైతం ఉంది. హత్యల అనంతరం ముందు టైర్ల సస్పెన్షన్‌ విరిగిపోవడంతో కారును అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు.  

టీడీపీ నాయకుల మారణకాండ ఇది.. 
ఈ హత్యలు పూర్తిగా గ్రామ టీడీపీ నాయకులు చేసిన మారణకాండ అని.. దీనిని వైఎస్సార్‌సీపీపైకి నెట్టి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే జూలకంటి కుట్ర పన్నారంటూ మృతుల బంధువులు వాపోతున్నారు. అసలు ఈ హత్యలతో ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి సోదరుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం ద్వారా అసలైన నిందితులను తప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అసలైన దోషులకు శిక్షలు పడకపోతే.. ప్రతీకార దాడులు కొనసాగే ప్రమాదముందని టీడీపీ కార్యకర్తలు సైతం సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు మన టీడీపీ వాళ్లదే అయితే.. వైఎస్సార్‌సీపీ పైకి నెట్టడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.  

హత్య చేసింది టీడీపీ వాళ్లేనంటూ నిర్ధారణ.. 
హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త, మృతుల అల్లుడు తోట ఆంజనేయులు మాట్లాడుతూ.. టీడీపీ నేత తోట వెంకట్రామయ్య వర్గమే ఈ ఘాతుకానికి పాల్పడిందని మీడియాతో పాటు పోలీసులకు సాక్ష్యం చెప్పాడు. ప్రాథమిక విచారణ అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఓ వీడియో విడుదల చేశారు. హత్యకు గురైన వారు, హత్యలు చేసిన వారు.. టీడీపీకి చెందిన వాళ్లేనని స్పష్టంగా ప్రకటించారు. దీనిని నిర్ధారిస్తూ ఎస్పీ కార్యాలయం కూడా పత్రికా ప్రకటన విడుదల చేసింది.  

పోలీసులపై జూలకంటి ఒత్తిడి.. 
అనంతరం హత్య జరిగిన ప్రదేశానికి శనివారం రాత్రి చేరుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపారు. ఈ హత్యల వెనుక పిన్నెల్లి సోదరుల కుట్ర ఉందని ఆరోపించారు. కేసు నమోదులో సైతం వారి పేర్లు ఉండాల్సిందేనంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు మాట మార్చి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు నమోదు చేశారు. దీని వల్ల ఎస్పీ మాటలకే విలువ లేకుండా పోయిందంటూ పోలీస్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement