breaking news
julakanti
-
చంపిందేమో జూలకంటి అనుచరులు.. కేసేమో పిన్నెల్లిపై!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: టీడీపీలోని ఆధిపత్య పోరుతోనే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జంట హత్యలు జరిగాయని సాక్షాత్తూ జిల్లా ఎస్పీ ప్రకటించినా.. ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అల్లుడు వెల్లడించినా కూడా కూటమి సర్కార్ బరితెగించి నీచ రాజకీయాలు చేస్తోంది. కళ్లెదుటే వాస్తవాలు కనిపిస్తున్నా.. రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. జూలకంటి ఫ్లెక్సీతో మొదలైన గొడవ.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్య అనంతరం గ్రామ టీడీపీ నాయకత్వం జవిశెట్టి వెంకటేశ్వర్లు చేతిలోకి వెళ్లింది. ఇది టీడీపీ నాయకుడు తోట వెంకట్రామయ్య వర్గానికి ఇబ్బందికరంగా మారింది. కొంతకాలంగా ఇరువర్గాలు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి జన్మదినం సందర్భంగా తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీను గత నెలలో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్న వీధిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన వర్గంతో కలిసి శ్రీనుపై దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టాడు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న తోట వెంకట్రామయ్య పక్కా కుట్రతో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావును కారుతో ఢీకొట్టి పాశవికంగా హత్య చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడైన తోట వెంకట్రామయ్యదే. ఆ కారు వెనుక జేబీఆర్ పేరుతో పసుపు రంగులో పెద్ద స్టిక్కర్ సైతం ఉంది. హత్యల అనంతరం ముందు టైర్ల సస్పెన్షన్ విరిగిపోవడంతో కారును అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. టీడీపీ నాయకుల మారణకాండ ఇది.. ఈ హత్యలు పూర్తిగా గ్రామ టీడీపీ నాయకులు చేసిన మారణకాండ అని.. దీనిని వైఎస్సార్‌సీపీపైకి నెట్టి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే జూలకంటి కుట్ర పన్నారంటూ మృతుల బంధువులు వాపోతున్నారు. అసలు ఈ హత్యలతో ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి సోదరుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చడం ద్వారా అసలైన నిందితులను తప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలైన దోషులకు శిక్షలు పడకపోతే.. ప్రతీకార దాడులు కొనసాగే ప్రమాదముందని టీడీపీ కార్యకర్తలు సైతం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు మన టీడీపీ వాళ్లదే అయితే.. వైఎస్సార్సీపీ పైకి నెట్టడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. హత్య చేసింది టీడీపీ వాళ్లేనంటూ నిర్ధారణ.. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త, మృతుల అల్లుడు తోట ఆంజనేయులు మాట్లాడుతూ.. టీడీపీ నేత తోట వెంకట్రామయ్య వర్గమే ఈ ఘాతుకానికి పాల్పడిందని మీడియాతో పాటు పోలీసులకు సాక్ష్యం చెప్పాడు. ప్రాథమిక విచారణ అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఓ వీడియో విడుదల చేశారు. హత్యకు గురైన వారు, హత్యలు చేసిన వారు.. టీడీపీకి చెందిన వాళ్లేనని స్పష్టంగా ప్రకటించారు. దీనిని నిర్ధారిస్తూ ఎస్పీ కార్యాలయం కూడా పత్రికా ప్రకటన విడుదల చేసింది. పోలీసులపై జూలకంటి ఒత్తిడి.. అనంతరం హత్య జరిగిన ప్రదేశానికి శనివారం రాత్రి చేరుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపారు. ఈ హత్యల వెనుక పిన్నెల్లి సోదరుల కుట్ర ఉందని ఆరోపించారు. కేసు నమోదులో సైతం వారి పేర్లు ఉండాల్సిందేనంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు మాట మార్చి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు నమోదు చేశారు. దీని వల్ల ఎస్పీ మాటలకే విలువ లేకుండా పోయిందంటూ పోలీస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
ఆ హత్యలతో నాకేం సంబంధం?
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన జంట హత్యలకు టీడీపీలోని ఆధిపత్య పోరే కారణమని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షితో పాటు జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారని పేర్కొన్నారు. అయినా కూడా కూటమి సర్కార్ రాజకీయ కక్షతో తనపై అక్రమ కేసు నమోదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండ్లపాడు జంట హత్యలపై వెల్దుర్తి పోలీసుస్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో తన పేరు చేర్చడంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం స్పందించారు. టీడీపీలోని ఆధిపత్య పోరుతోనే జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావును అదే పార్టీలోని ప్రత్యర్థి వర్గం పొట్టన పెట్టుకుందన్నారు. ఈ విషయాన్ని హత్య జరిగినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి, మృతుల అల్లుడు తోట ఆంజనేయులు మీడియాతో పాటు పోలీసులకు కూడా తెలియజేశారన్నారు. టీడీపీలోని వర్గపోరు వల్లే ఈ హత్యలు జరిగాయని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సైతం శనివారం ప్రకటించారని గుర్తు చేశారు. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో గొడవలు జరగ్గా. ఇరు వర్గాలు టీడీపీ వాళ్లేనని వదిలేయడంతో సమస్య పెద్దదైందన్నారు. ఆనాడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. హత్య జరిగిన ప్రదేశంలో జేబీఆర్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడి కారు దొరికినా.. ప్రత్యక్ష సాక్షులు సైతం హత్యలు చేసింది టీడీపీ వాళ్లేనని చెబుతున్నా.. తనపై ఎందుకు నిందలు వేస్తున్నారని పిన్నెల్లి ప్రశ్నించారు. జంట హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం మాచర్ల ప్రజలందరికీ తెలుసునన్నారు.అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి తనపై అక్రమ కేసు నమోదు చేయించారని మండిపడ్డారు. ఈ హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏ గుడిలోనైనా ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. ధైర్యం ఉంటే బ్రహ్మారెడ్డి తన పిల్లలపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల తరఫున పోరాడుతామని పిన్నెల్లి స్పష్టం చేశారు. -
50 వసంతాల ‘సెస్’
అనేక సంక్షోభాలను సంస్కరణలను ఎదుర్కొని ఐదు దశాబ్దాలుగా కాలపరీక్షకు నిలిచి జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలను పొందిన సంస్థ సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ సిరిసిల్ల(కో–ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై లిమిటెడ్, సిరిసిల్ల). సంస్థను ప్రారంభించి ఈ నవంబర్ 1 నాటికి 50 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుం టోంది. ఈ సంస్థను సంక్షిప్తంగా సెస్ అని వాడుకలో పిలుస్తారు. సహకార రంగంలో విద్యుత్తును తన వినియోగదారులకు సరఫరా చేయడంలోనూ, ఉత్తమ సేవలను అందించడంలోనూ దేశంలోనే అత్యున్నత శిఖరాలకు చేరుకున్న సెస్ స్వర్ణోత్సవాల వైపు పరిగెడుతున్నది. సహకార శాఖ చట్టం పరిధిలో అక్టోబర్ 1969న రిజిస్ట్రేషన్ చేసుకొని, 1970 నవంబర్ 1 నుంచి ఆచరణాత్మకంగా ‘సెస్’ ఉనికిలోకి వచ్చింది. భారతదేశం గ్రామాల్లో నివసిస్తున్నది అన్న మహాత్మా గాంధీ.. అభివృద్ధికి గ్రామాలు పట్టుకొమ్మలని కూడా చెప్పారు. ఈ స్ఫూర్తితో వ్యవసాయ అభివృద్ధి, గ్రామాల ఉన్నతి, ప్రజల వికాసం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్.ఇ.సి)ను 1969లో ప్రారంభించింది. దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 5 గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంఘాలు ప్రారంభమయ్యాయి. ఆయా రాష్ట్రాల్లోని సంస్థల అభివృద్ధి ప్రణాళికలకు గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ నేపథ్యంలోనే సిరిసిల్లలో సహకార విద్యుత్ సరఫరా సంఘం ఏర్పాటు అయినది. ఇది అప్పటి సిరిసిల్ల పాత తాలూకా ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 13 మండలాలు 2 మున్సిపాలిటీల పరిధిలో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. దీని సాధన, స్థాపన వెనుక అప్పటి సిరిసిల్ల్ల శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు పట్టుదల ఎన్నదగినది. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల ప్రాంతానికి ఏకైక సంస్థను తీసుకురావడం అంటే మాటలు కావు. అనంతరం సంస్థ మనుగడలో అప్పటి శాసనసభ్యులు జే నర్సింగరావు, గొట్టె భూపతిల పాలనా సామర్థ్యాలు, అప్పటి ఉన్నత అధికారులు, ఉద్యోగులు, విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన సంస్థ ఉద్యోగుల త్యాగాలు, నిస్వార్థ సేవలు కీలక భూమిక వహించాయి. 50 ఏళ్లుగా సంస్థ ఎదురులేకుండా నిలబడడానికి కారణం వారి పటిష్ట ప్రణాళికల పునాది ఫలితమేనని చెప్పాలి. దీనికి నిదర్శనమే నాటి రాష్ట్ర విద్యుత్ బోర్డు నుండి కేవలం 4,720 సర్వీసులు సంస్థకు దఖలు పడగా, నేడు 2 లక్షల 55 వేల 830 కనెక్షన్లు వివిధ కేట గిరీలలో కలిగి, సంస్థ ఎన్నో వందల రెట్లు పురోగతి సాధించింది. నాడు కేవలం 2,299 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా నేడు 76 వేల 306 వ్యవసాయ సర్వీసులున్నాయి. సంస్థ అయిదు దశాబ్దాల విజయగాథలో సభ్యులు, వినియోగదారులు, అత్యంత క్రియాత్మకంగా బాధ్యత వహించారు. నేడు సభ్యుల సంఖ్య 2 లక్షల 97 వేల 708 కలదు. వీరి వాటా ధనం 6 కోట్ల 14 లక్షల 81 వేల 587 రూపాయలు కలవు. అంటే సంస్థ ఆర్థిక హార్దిక పురోగతిలో వీరి సహాయ సహకారాలు ఎంత అమోఘంగా పని చేశాయో తెలుస్తుంది. ప్రారంభంలో విద్యుత్ లైన్ల నిర్మా ణంలో, ట్రాన్స్ఫార్మర్ల స్థాపనలో, పని ప్రదేశాలకు సామాగ్రి రవాణా చేయడంలో వీరి స్వచ్ఛంద శ్రమదానం ఇమిడి ఉంది. శ్రమదానం విలువ సుమారు ఒక కోటి 50 లక్షలు ఉంటుంది. వినియోగదారుల శ్రమదానం సంస్థలో 1995 వరకు సాగింది. ఇకపోతే సహకార రంగంలో సెస్ పురోగతి గణాంకాలను పరిశీలిస్తే సగటు తలసరి విద్యుత్ వినియోగం దాదాపు 1,600 విద్యుత్ యూనిట్ల వరకు ఉంది. అదే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో తలసరి విద్యుత్ విని యోగం 1,268 యూనిట్లుగా ఉన్నది. ఉద్యోగుల విషయానికి వస్తే సంస్థలో 666 సర్వీసులకు ఒక ఉద్యోగి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాడు. ఎన్పీడీసీఎల్లో 586.45 సర్వీసులకు ఒక ఉద్యోగి తన సేవలను అందిస్తున్నాడు. సెస్ సహకార రంగంలో విద్యుత్ పంపిణీ నిర్మాణ సంస్థ కాబట్టి, గతంలో ఇప్పుడు కూడా విద్యుత్తును అప్పటి విద్యుత్ బోర్డు నుంచి ,ఇప్పటి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి కొనుగోలు చేసి తన వినియోగదారులకు ప్రభుత్వ ఆదేశాల రేట్ల ప్రకారం వివిధ కేటగిరీల్లో నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తున్నది. విద్యుత్ సంస్కరణలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 1999లో ఏర్పాటుచేసిన రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ నియంత్రణ మండలి (ఇ.ఆర్.సి) నిబంధనలు ఆదేశాలకు లోబడి సంస్థ పనిచేస్తుంది. 1970లో స్థాపించిన సెస్ పని విధానం, నిర్వహణ తీరు తెన్నులను చూసి, నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రాంతాలలో 13 సహకార విద్యుత్ సరఫరా సంఘాలను స్థాపించాయి. కానీ అందులో ఇప్పుడు తెలంగాణలో ఒకే ఒక్క సెస్ సంస్థ మిగిలిపోగా, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి. 8 సంస్థల నష్టాలను దృష్టిలో ఉంచుకొని నాటి ప్రభుత్వం సంబంధిత విద్యుత్ పంపిణీ వ్యవస్థలలో విలీనం చేసింది. ఉద్యోగవర్గాలకు, పాలకవర్గాలకు విని యోగదారులకు మధ్యనగల అవినాభావ సంబంధ బాంధవ్యాలు, సహకార మమకారాల వలననే సంస్థ గత 50 ఏళ్లుగా తన విజయయాత్రను అవి చ్ఛిన్నంగా కొనసాగిస్తున్నది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కూడా వినియోగదారుల సహకారంతో దిగ్విజయంగా సాగిపోతున్నది. ముఖ్యంగా సంస్థ ప్రారంభమైన ఐదు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధినీ సాధించడమేకాక గణనీయమైన ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించింది. తద్వారా రైతాంగం రైతు కూలీల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అంతేగాక సిరిసిల్ల నేత రంగం, అనుబంధ రంగాలు, కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న చేనేత పవర్లూమ్ పరిశ్రమకు 50 శాతం విద్యుత్ రాయితీ కల్పించడం వలన చేనేత కుటుంబాల బతుకులు మరింత సుభిక్షంగా ఉన్నాయి. అంతేకాక ఈ సంస్థ పరిధిలో సిరిసిల్ల టెక్సటైల్ పార్క్ కూడా కొనసాగుతున్నది. దీనితో ప్రభుత్వ సంక్షేమ చేయూతతో అనేక మంది నేత కార్మికులు వలసలకు విరామం చెప్పి సిరిసిల్లలోనే తమ వృత్తిని కొనసాగిస్తూ సరిపోయే జీవన భృతిని పొందుతున్నారు. సంస్థ స్వర్ణోత్సవాలు నిర్వహించుకోనున్న సంవత్సరంలో ఉత్తమ వినియోగదారులకు, ఉద్యోగులకు, గ్రామ ప్రతినిధులకు మధ్య మరింత సత్సంబంధాలను ఆదానప్రదానాలుగా కొనసాగాలి. మరో శతాబ్దం వరకు సంస్థ మనుగడ ఇంకా అద్వితీయంగా కొనసాగాలి. -జూకంటి జగన్నాథం వ్యాసకర్త కవి, విమర్శకులు ‘ 94410 78095 -
కేసీఆర్ బెదిరింపులు సరికాదు: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంపై వచ్చిన విమర్శల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రతో తక్కువ ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోవడంవల్ల రాష్ట్రంపై అధిక నిర్మాణ భారంతో పాటు వచ్చే నీళ్లు కూడా తక్కువగానే ఉంటాయన్నారు. గతంలో ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలిచి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదంటూ వివరించలేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఆయా అంశాలను లేవనెత్తిన విపక్షాలపై సీఎం కేసీఆర్, మంత్రులు కేసులు పెడతాం, జైళ్లో పెడతామనే బెదిరింపుల తీరు సరైంది కాదన్నారు. -
చెరువును పరిశీలించిన జూలకంటి
మిర్యాలగూడ : మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు చేపట్టిన చెరువులో ట్రాక్టర్‌తో దున్నుతున్నారని ఐలాపురం గ్రామానికి చెందిన రైతులు మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం రైతులతో కలిసి సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి గ్రామంలోని చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఐలాపురం గ్రామం ఏర్పడిన నాటి నుంచి చెరువులో ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఎలా ఐదెకరాల భూమి పట్టా ఇచ్చారని అన్నారు. చెరువులో ట్రాక్టర్‌తో దున్నుతున్నారని, దాని వల్ల రైతులకు తీరని అన్యాయం జరగనున్నదని అన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఇచ్చిన పట్టాను రద్దు చేయాలని కోరారు. చెరువును సందర్శించిన వారిలో సీపీఎం డివిజన్ కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, రెహమాన్‌ఖాన్, రైతులు సాయన్న, గోప్యానాయక్, భిక్షం, సైదానాయక్, దీప్లానాయక్, శ్రీను, రంగా, లచ్చ, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం
మిర్యాలగూడ : నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలను నిర్వహించిన వ్యక్తి నకిరేకంటి అంజయ్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 18వ వార్డు బాపూజీనగర్‌లో నకిరేకంటి అంజయ్య వీధిని వారు ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రథమ వర్ధంతి సభలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అంజయ్య 30 ఏళ్లుగా వివిధ రంగాల్లో పని చేయడంతో పాటు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలను నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో ఆకాల మరణం చెందడం పార్టీకి తీరనిలోటన్నారు.అంజయ్య ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, డివిజన్, పట్టణ కార్యదర్శులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీష్‌చంద్ర, నాయకులు మల్లు గౌతమ్‌రెడ్డి, మహ్మద్‌బిన్ సయ్యద్, గొర్ల ఇంద్రారెడ్డి, శ్రీనివాస్, వెంకయ్య, రమేష్, పద్మయ్య, పాండు, రవినాయక్, పిచ్చయ్య, రామచంద్రు, లింగమయ్య, రహమన్ఖాన్ తదితరులున్నారు. -
సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి
భువనగిరి : కాంట్రాక్టు రెండో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి సమరశీలంగా ఉద్యమించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. భువనగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట రెండో ఏఎన్ఎంలు నిర్వహిస్తున్న సమ్మె గురువారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి సమ్మెకు సంఘీబావం తెలిపి మాట్లాడారు. ఎన్నికల ముందు వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే మర్చిపోయారని విమర్శించారు. 11 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని, దీన్ని ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, తుర్కపల్లి సురేందర్, దాసరి పాండు, జంగయ్య, శ్రీనివాస్, ఏఎన్ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు కైరంకొండ సరస్వతి, ఫర్వీన్, అనిత, నీలిమ, ధనలక్ష్మి, జయశ్రీ, సునంద, సునీత, మమత, విజయరాణి, సువర్ణ, కవిత ఉన్నారు. -
ప్రజామోదం మేరకు ప్రాజెక్టులు నిర్మించాలి : జూలకంటి
చిట్యాల : ప్రజామోదం మేరకు ప్రాజెక్టులను, పరిశ్రమలను ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు. చిట్యాలలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణాలు ఆస్తులను కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. హైవే వెంట హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల్లో ఎన్ని నాటుకున్నాయో సీఎం సమీక్ష ద్వారా నిర్థారణ చేసుకోవాలన్నారు. సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మామిడి సర్వయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముల్కపల్లి రాములు, మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, నారబోయిన శ్రీనివాస్, శీలా రాజయ్య పాల్గొన్నారు.