
సౌందరరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులో గుంటూరు ఆరో అదనపు న్యాయస్థానంలో సమర్పించేందుకు పోలీసులు రూపొందించిన రిమాండ్ రిపోర్ట్
సోషల్ మీడియా కార్యకర్త సౌందరరెడ్డిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచిన పోలీసులు
సాక్షి అమరావతి/సాక్షి,గుంటూరు: రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పోలీసులే కిడ్నాపర్లుగా మారుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది.అంతేకాదు.. ఏకంగా హైకోర్టుకే బురిడీ కొట్టించేందుకు యత్నించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది.
కేసు నమోదు చేయకుండా..
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరులో సోషల్ మీడియా కార్యకర్త సౌందరరెడ్డి(సవీంద్రరెడ్డి)ని ప్రత్తిపాడు పోలీసులు సోమవారం రాత్రి అపహరించారు. తన భార్య లక్ష్మీప్రసన్నతో కారులో వెళ్తున్న ఆయన్ని పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. సౌందరరెడ్డి భార్యను రోడ్డుపై వదిలేసి ఆయన్ను కారుతో సహా అపహరించడం తీవ్ర కలకలం రేపింది. తాము తాడేపల్లి పోలీసులమని.. ఓ కేసులో విచారించి అరగంటలో ఆయన్ను పంపేస్తామని ఆమెతో నమ్మబలికారు.
అయితే ఆమె తాడేపల్లి స్టేషన్‌కు వెళ్లగా.. అసలు సౌందరరెడ్డిని తాము తీసుకురాలేదని అక్కడి పోలీసులు చెప్పడం గమనార్హం. దాంతో తన భర్తను పోలీసుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. దీనిపై సౌందరరెడ్డి భార్య లక్ష్మీప్రసన్న మంగళవారం ఉదయం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
మేం అదుపులోకి తీసుకోనే లేదు.. హైకోర్టుకు పోలీసుల బురిడీ..!
హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీసులు మరింత బరి తెగించారు. మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ కేసు విచారణకు రాగా... అసలు సౌందరరెడ్డిని తాము అదుపులోకి తీసుకోనేలేదని హైకోర్టుకు పోలీసులు చెప్పడం గమనార్హం. ఆయన తమ అదుపులోనే లేరని చెప్పారు.
మా ఎదుటే హాజరుపరచండి..
సౌందరరెడ్డిని బుధవారం తమ ఎదుట హాజరుపర్చాలని విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అంతేకాదు.. ఆయన్ను మరే ఇతర మేజిస్ట్రేట్ కోర్టులోనూ హాజరుపరచవద్దని కూడా స్పష్టంగా తేల్చి చెప్పింది.
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు.. గుంటూరు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు
న్యాయస్థానం ఇంత స్పష్టంగా చెప్పినా పోలీసుల తీరు మారలేదు! హైకోర్టు ఆదేశాలు అంటే తమకు ఏమాత్రం లెక్క లేదన్నట్టు వ్యవహరించారు. సౌందరరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు బనాయించారు. ఆయన్ను సోమవారం రాత్రంతా గుంటూరు సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. అనంతరం పోలీసులు మంగళవారం ఉదయం ఆయన్ను ప్రత్తిపాడు పోలీసు స్టేషన్‌కు తరలించి గంజాయి కేసులో ఆరో ముద్దాయిగా అక్రమంగా చేర్చారు. అంతటితో పోలీసులు ఆగలేదు.. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ సౌందరరెడ్డిని గుంటూరు ఆరో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ముందు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో హాజరుపరిచారు.
అక్రమంగా గంజాయి కేసులో నిందితుడుగా చేరుస్తూ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించేందుకు రిమాండ్ రిపోర్ట్ రూపొందించారు. అయితే హైకోర్టు ఆదేశాలపై సమాచారం ఉండటంతో పోలీసులు అతడిని తన ఎదుట హాజరుపరచడం సరికాదని మేజిస్ట్రేట్ స్పష్టంచేశారు. సౌందరరెడ్డిని బుధవారం ఉదయం హైకోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకూ న్యాయవాది సమక్షంలో ప్రత్తిపాడు పోలీసు కస్టడీలో ఉంచాలని ఆదేశించారు.
నిర్భీతిగా హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన..
రాష్ట్రంలో పోలీసులు ఎంత చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నది... అక్రమ కేసులతో ఎంతగా వేధిస్తున్నారన్నది ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. అంతేకాదు.. అవాస్తవ సమాచారంతో ఏకంగా హైకోర్టునే బురిడీ కొట్టించేందుకు యత్నిచడం తీవ్రంగా విస్మయ పరుస్తోంది. ఏకంగా హైకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘించడం పోలీసుల బరితెగింపును బట్టబయలు చేస్తోంది. పోలీసుల తీరుపై హైకోర్టు బుధవారం ఎలా స్పందిస్తుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.