సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు: పోలీసుల అదుపులో అనుమానితుడు! | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు: పోలీసుల అదుపులో అనుమానితుడు!

Published Wed, Apr 17 2024 4:32 AM

Police Probing Stone Attack On Andhra Chief Minister As Attempt To Murder - Sakshi

సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పురోగతి

ఐదుగురిని లోతుగా విచారిస్తున్న పోలీసులు

వారిలో ఒకరు కీలక వ్యక్తి.. మిగతా వారు సహకరించినట్లు భావన

విజయవాడకు చెందిన ఓ టీడీపీ నాయకుడిని కూడా విచారిస్తున్న పోలీసులు

త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసుల ధీమా

మీడియాలో వచ్చిన కథనాలను నిర్ధారించని పోలీసులు

తాము చెప్పేవరకు ఎటువంటి కథనాలూ నమ్మవద్దని వినతి

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం రాత్రి విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లో ‘మేమంతా సిద్ధం’ యాత్ర నిర్వహిస్తుండగా పదునైన రాయితో ఆయనపై దాడి చేసిన అనుమానితుడిని గుర్తించినట్టు సమాచారం. అతనితోపాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

అజిత్‌సింగ్‌ నగర్‌ డాబా కొట్ల జంక్షన్‌ వద్ద వివేకానంద స్కూల్‌ ప్రాంగణం నుంచి పదునైన రాయితో సీఎం జగన్‌పై దాడికి పాల్పడినట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఐపీసీ 307 కింద హత్యాయత్నంగా కేసు నమోదు చేసి ఆరు ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియో ఫుటేజిలు, కాల్‌ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను అన్ని కోణాల్లో విశ్లేషించారు. అజిత్‌ సింగ్‌ నగర్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 60 మంది అనుమానితులను విచారించారు. వారిలో నేర చరితులు, అసాంఘిక శక్తులు, ప్రతిపక్ష టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే ముఠాల సభ్యులు, వ్యసనపరులైన అసాంఘిక శక్తుల చేతుల్లో కీలు»ొమ్మలుగా మారిన యువత వంటి వారు ఉన్నారు. అనుమానితులను విడివిడిగా విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు.

హత్యాయత్నానికి పాల్పడిన రోజుకు (శనివారానికి) రెండు రోజుల ముందు నుంచి వారు ఎక్కడెక్కడ సంచరించారో వివరాలు సేకరించారు. వారు చెప్పిన సమాచారాన్ని కాల్‌ డేటా, సీసీ కెమెరాల వీడియో ఫుటేజిలతో పోల్చి చూశారు. సీసీ టీవీ ఫుటేజిల ఆధారంగా కొందరు యువకులపై పోలీసులకు సందేహం కలిగింది. వారిని మరింత లోతుగా విచారించి, కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ యువకుల గుంపే హత్యాయత్నానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వారిలో ఒకరు ప్రధాన నిందితుడిగా,  మిగిలినవారు అతనికి సహకరించినట్లు భావిస్తున్నారు.

దీనిపై ఇంకా పోలీసులు పూర్తి నిర్ధారణకు రాలేదు. తొందరపడకుండా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఒకటికి రెండుసార్లు పరిశీలించి తుది నిర్ధారణకు రావాలని భావిస్తున్నారు. కాగా హత్యాయత్నానికి పాల్పడినవారిని గుర్తించడంపై మంగళవారం వివిధ టీవీ చానళ్లు ప్రసారం చేసిన వార్తలను పోలీసులు నిర్ధారించలేదు. అవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. ఏదైనా విషయాన్ని తాము అధికారికంగా ప్రకటించేంతవరకు నమ్మవద్దని కోరారు. అప్పటివరకు తాము విచారించిన వారందరూ అనుమానితులే తప్ప నిందితులుగా భావించవద్దని చెప్పారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసువర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement