పరిశ్రమలకు పుష్కలంగా నీటి వసతి | Plenty of water accommodation for industries Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు పుష్కలంగా నీటి వసతి

Aug 30 2021 3:58 AM | Updated on Aug 30 2021 3:58 AM

Plenty of water accommodation for industries Andhra Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు శాశ్వత నీటి వసతి కల్పన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అభివృద్ధి చేస్తున్న వివిధ పారిశ్రామిక పార్కులకు పుష్కలంగా నీటిని అందించేలా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. కృష్ణపట్నం వద్ద నెలకొల్పే క్రిస్‌ సిటీతో పాటు నాయుడుపేట సెజ్, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి – ఏర్పేడు నోడ్, నెల్లూరు జిల్లా మాంబట్టు సెజ్, చిత్తూరు జిల్లా చిన్నపండూరు పారిశ్రామిక వాడ, శ్రీసిటీ సెజ్‌లకు పూర్తిస్థాయిలో నీటి సదుపాయం కలగనుంది. ప్రస్తుతం తొలి దశలో అభివృద్ధి చేస్తున్న పార్కుల అవసరాలకు తగినట్లుగా రోజూ 111.93 మిలియన్‌ లీటర్ల నీటిని అందించేలా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. కండలేరు రిజర్వాయర్‌ నుంచి కృష్ణపట్నం, శ్రీసిటీ వరకు సుమారు 205 కి.మీ పైప్‌లైన్‌ ద్వారా నీటిని తరలించనున్నారు. ఆయా పారిశ్రామిక పార్కుల వద్ద ఆరు భూగర్భ రిజర్వాయర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.550 కోట్లు వ్యయం కానుంది.

ప్రత్యామ్నాయ మార్గాలకు డీపీఆర్‌లు...
కండలేరు నుంచి నీటి తరలింపు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 30 శాతానికిపైగా పనులు పూర్తైనట్లు ఏపీఐఐసీ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస ప్రసాద్‌ తెలిపారు. తొలుత ప్రతిపాదించిన మార్గంలో కొన్ని చోట్ల అనుమతులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) కోసం ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. సెప్టెంబర్‌ 7లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీసిటీలోని పరిశ్రమలతో పాటు చిన్నపండూరు వద్ద ఏర్పాటైన హీరో మోటార్స్, అపోలో టైర్స్‌ లాంటి సంస్థల నీటి అవసరాలు తీరనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement