
కూటమి విధ్వంస రచన
సముద్ర పర్యావరణంపై పగబట్టిన ప్రభుత్వం
సంపద సృష్టి కోసం సాగర తీరంలో పర్యాటక ప్రాజెక్టులు
జీవ వైవిధ్యం కోసం పగడపు దీవుల్ని కాపాడుతున్న ఎన్జీవో సంస్థ ప్లాటిపస్
పదేళ్లపాటు సంరక్షిస్తే సముద్ర తీర సంరక్షణ
తిమ్మాపురం నుంచి మంగమారిపేట వరకు విస్తరించిన కోరల్ రీఫ్స్
ఆ ప్రాంతంలోనే వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ప్రభుత్వ కుట్ర
పగడపుదిబ్బల రక్షణ కోసం పోరాటం చేస్తున్న ప్లాటిపస్ ప్రతినిధులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎక్కడా లేని విభిన్న పగడపు దిబ్బలకు చిరునామాగా ఉన్న విశాఖ తీరంలో విధ్వంసకాండకు తెరతీసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోంది. సంపద సృష్టి కోసం.. పర్యాటకం పేరుతో.. పర్యావరణంపై వేటు వేస్తున్నారు. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్లాటిపస్ ఎన్‌జీవో సంస్థ సముద్ర గర్భంలో పగడపు దీవుల్ని కాపాడుకుంటూ వస్తోంది.
మరో పదేళ్ల పాటు వాటిని సంరక్షిస్తే.. మరింత విస్తరించి.. సాగరతీర స్వచ్ఛతతో పాటు.. కోతకు గురయ్యే ప్రమాదం నుంచి కాపాడవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లుగా మంగమారిపేట తీరంలో వాటర్‌స్పోర్ట్స్‌కు టెండర్లు ఆహ్వానించి విధ్వంస రచనకు సంతకం చేస్తుండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగడపుదిబ్బల రక్షణ కోసం పోరాటం కొనసాగించేందుకు ప్లాటిపస్ సంస్థ ప్రతినిధులు నడుంబిగించారు.
కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అస్సలుండవని గతంలో అనేక సర్వేలు చెప్పినప్పటికీ, ఇటీవల జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు ఆ వాదనను తప్పని నిరూపించాయి. విశాఖ సాగరతీరంలో విభిన్న రకాల కోరల్స్ (పగడపు దిబ్బలు) ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మంగమారిపేట ప్రాంతంలో సాగరగర్భంలో విభిన్న పగడపు దిబ్బలు ఉన్నట్లు అన్వేషణలో తేలింది. దీని వెనుక ప్లాటిపస్ ఫౌండేషన్ కృషి ఎంతో ఉంది. తిమ్మాపురం, రుషికొండ, మంగమారిపేట మొదలైన ప్రాంతాల్లో నిరంతరం సాగరగర్భ స్వచ్ఛత కోసం ఈ సంస్థ ఏళ్ల తరబడి శ్రమిస్తోంది.
సముద్రపు లోతుల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను ఇప్పటివరకు 2 లక్షల 60 వేల కిలోల వరకు తొలగించారు. అక్కడ ఉన్న పగడపు దిబ్బలను సంరక్షిస్తూ వాటి అభివృద్ధి కోసం స్కూబా డైవర్లతో కలిసి నిరంతరం కృషి చేయడంతో మంగమారిపేట, తిమ్మాపురం ప్రాంతాల్లో ఇవి విస్తరించాయి. స్కెలరాక్టినియా కోరల్స్, పవోనా ఎస్‌పీ, లిథోఫిలాన్ ఎస్‌పీ, మోంటీపోరా ఎస్‌పీ, పోరిటెస్ ఎస్‌పీ, హెక్సాకోరిలియా, ఆక్టోకోరలియా, డిస్కోసోమా, లోబాక్టిస్ వంటి అరుదైన పగడపు దిబ్బలు విస్తారంగా ఉన్నాయి.
జీవవైవిధ్యానికి ప్రతిరూపాలు
ఈ కోరల్స్ ద్వారా సముద్ర జీవజాలాన్ని సంరక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బలను పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్బోనేట్ నిర్మాణాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్రగర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవి ఉంటే సముద్ర జీవరాశులు ఎక్కువగా వృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి.

సముద్రంలోని చేపలతో పాటు 25 శాతం జీవులకు సముద్ర వర్షారణ్యాలు అని పిలిచే పగడపు దిబ్బలే ఆవాసాలు. రంగురంగుల చేపల నుంచి గంభీరమైన సముద్ర తాబేళ్ల వరకు లెక్కలేనన్ని జాతులకు ఇవి కీలకమైన ఆశ్రయం, సంతానోత్పత్తి ప్రదేశాలుగా మారి ఆహార వనరులను అందిస్తాయి. చేపలు, మొలస్కా, ఇతర జీవజాతులు, క్రస్టేసియన్లు, స్పాంజ్‌లు మొదలైన సముద్ర జాతుల ఉత్పత్తి పెరిగేందుకు ఇవి అనువైన వాతావరణాన్ని అందిస్తాయి.
‘కూటమి’కాసుల కక్కుర్తికి బలి.!
తీరప్రాంత నిర్మాణాలు పెరగడం, ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా ఇప్పటికే 33 శాతం పగడాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వాతావరణ మార్పులు, విధ్వంసకర మానవ చర్యల వల్ల వీటి మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. తీరప్రాంతాన్ని రక్షించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్లాటిపస్ సంస్థ ఈ పగడపు దిబ్బలను సంరక్షిస్తోంది. అయితే ఇలాంటి అరుదైన ప్రాంతంపై ఇప్పుడు కొందరు కూటమి నేతల కన్ను పడింది. సంపద సృష్టి పేరుతో తిమ్మాపురం నుంచి మంగమారిపేట వరకు ఆక్వా స్పోర్ట్స్‌ను అభివృద్ధి చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు.
వాస్తవానికి ఈ ప్రాంతం వాటర్‌స్పోర్ట్స్‌కు అనువుగా లేకపోయినా కేవలం కొన్ని సంస్థలకు భూములు కట్టబెట్టేందుకే పర్యాటక శాఖ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. టూరిజం మంత్రి అండదండలున్న ఒక సంస్థ కోసం పగడపు దిబ్బలను నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పగడపు దిబ్బలను సంరక్షించేందుకు ప్లాటిపస్ ఫౌండేషన్ సంస్థ పోరాటానికి సిద్ధమైంది. ఈ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ వద్దని, వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని వారు అధికారులను కోరుతున్నారు.
పదేళ్లపాటు సంరక్షించుకోవాలి
కొన్ని తీర ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించి ఆక్వా స్పోర్ట్స్ అభివృద్ధి కోసం ప్రయత్నించడం మంచి పరిణామమే. కానీ అత్యంత అరుదైన, జీవవైవిధ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేసే పగడపు దిబ్బలు ఉన్న ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం మాత్రం తగదు.
గత కొన్నేళ్లుగా మంగమారిపేట ప్రాంతంలో కోరల్ రీఫ్స్‌ను పెంచుతూ వస్తున్నాం. వీటిని మరో పదేళ్లపాటు సంరక్షించుకుంటే ఈ ప్రాంత సముద్ర తీరం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నాం. – సుభాష్ చంద్రన్, ప్లాటిపస్ ఫౌండేషన్ ప్రతినిధి