కొల్లేరు పర్యాటకం.. కొత్త అందాల నిలయం

Plan for development of eco tourism in Kolleru - Sakshi

కొల్లేరులో ఎకో టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్లతో ప్రణాళిక 

కొల్లేరు మండలాల్లో 20 ప్రాంతాలను గుర్తించిన అటవీ శాఖ

ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాలకు మెరుగులు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. కొల్లేరు మండలాల్లో ఎకో టూరిజం, టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్లు ఖర్చు కాగల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అటవీ, పర్యాటక శాఖల అధికారులు ఇప్పటికే 20 పర్యాటక ప్రాంతాలను కొల్లేరులో గుర్తించారు. రానున్న రోజుల్లో కొల్లేరు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో విశిష్ట స్థానాన్ని దక్కించుకుంటుందని పర్యావరణ విశ్లేషకులు భావిస్తున్నారు.

విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌(జీఐఎస్‌)లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఒబెరాయ్, నోవాటెల్, హయత్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు కావడంతో విదేశీ పర్యాటకులు సైతం కొల్లేరు పర్యటనకు ఇష్టపడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారు. 

టెంపుల్‌ టూరిజం సర్కిల్‌గా కొల్లేరు
కొల్లేరు అందాలకు అదనపు ఆకర్షణగా టెంపుల్‌ టూరిజం మారనుంది. రాష్ట్రంలో అత్యధిక భక్తులు వచ్చే 100 ఆలయాల్లో ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి, పంచారామ క్షేత్రాలైన భీమవరం ఉమాసోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి, భీమవరం మావుళ్లమ్మ, కొల్లేటి పెద్దింట్లమ్మ ఆలయాలు ఉన్నాయి.

ఇప్పటికే కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద రూ.5 కోట్లతో సమీప జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా అనివేటి మండపం నిర్మిస్తున్నారు. మరోవూపు కైకలూరు మండలం సర్కారు కాలువ వంతెన వద్ద రూ.14.70 కోట్ల నిధులతో వారధి నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ వంతెన ద్వారా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ప్రయాణ దూరం తగ్గుతుంది. నేరుగా ఆర్టీసీ బస్సులు కొల్లేరు గ్రామాలకు రానున్నాయి. 

పర్యాటకానికి పెద్ద పీట
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యా­టక రంగానికి పెద్దపీట వే­స్తున్నారు. ఇప్పటికే కొల్లే­రు­లో టూరిస్ట్‌ పాయింట్లను గుర్తించాం. ఎకో, టెంపుల్‌ టూరిజాలకు కొల్లేరు చక్కటి ప్రాంతం. పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతాం. – ఎండీహెచ్‌ మెహరాజ్,  పర్యాటక శాఖ అధికారి

పక్షుల కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు
ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాల్లో యాత్రి­కుల కోసం అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద పక్షుల విహార చెరువు గట్లను పటిష్ట­పరిచాం. ఎక్కువగా విదేశీ, స్వదేశీ పక్షులు విహరిస్తున్న, పర్యాటకులు చూసే అవకాశం కలిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్థి పనులను చేయిస్తున్నాం. – జె.శ్రీనివాసరావు, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్, కైకలూరు

పర్యాటక రంగానికి ఊతం
కోవిడ్‌ వల్ల దెబ్బతిన్న పర్యాటక శాఖకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.198.50 కోట్ల ప్యాకేజీని కేటాయించింది. ఇందులో భాగంగా ఇటీవల రూ.2 కోట్లతో కొరటూరు రిసార్ట్స్, జల్లేరు జలాశయం, జీలకర్రగూడెం గుంటుపల్లి గుహలు, పేరుపాలెం బీచ్, సిద్ధాంతం, పట్టిసీమ వంటి ప్రాంతాల్లో పర్యాటక శాఖ వివిధ అభివృద్థి పనులు చేపట్టింది.

టెంపుల్‌ టూరిజంలో భాగంగా ఇప్పటికే ప్రముఖ దేవాలయాల వద్ద హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో పూర్తిస్థాయి పర్యాటకాభివృద్ధి కోసం సుమారు రూ.800 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసి ప్రతిపాదనల నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు సమర్పించారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top