
పీజీ ఇన్‌సర్వీస్ కోటా కుదింపు, ఇతర సమస్యల పరిష్కారంపై తగ్గని పీహెచ్‌సీ వైద్యులు
నేటి నుంచి ఎమర్జెన్సీ సేవలు బహిష్కరణ
గురువారం ‘ఛలో విజయవాడ’కు పిలుపు
శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరిక
వీరికి ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ మద్దతు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులతో సోమవారం వైద్యశాఖ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతోసమ్మెను ఉధృతం చేస్తామని పీహెచ్‌సీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషోర్ ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి ఎమర్జెన్సీ వైద్య సేవలను బహిష్కరిస్తున్నామని వెల్లడించారు.
ఇప్పటికే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌పేషెంట్ సేవలను బహిష్కరించామన్నారు. అయితే సమ్మె చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంహెచ్‌ఓలను ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఎస్మా ప్రయోగిస్తామని ఇప్పటికే పలు జిల్లాల డీఎంహెచ్‌ఓలు హెచ్చరించారు.
ప్రభుత్వం దిగి రాకపోవడంతో..
మెడికల్ పీజీ కోర్సుల్లో ఇన్‌సర్వీస్ కోటా కుదింపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం పీహెచ్‌సీ వైద్యులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. గత వారంలోనే ప్రభుత్వానికి వైద్యుల సంఘం సమ్మె నోటీసు ఇవ్వడంతో పాటు, సమ్మె కార్యాచరణను ప్రకటించింది. ఈ క్రమంలో గత శుక్రవారం నుంచే ఆన్‌లైన్ రిపోర్టింగ్, పీహెచ్‌సీ వెలుపల మెడికల్ క్యాంపులలో వైద్యసేవలను బహిష్కరించారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో సోమవారం ఓపీ సేవలను పూర్తిగా బహిష్కరించారు. దీంతో.. ఆస్పత్రులకు వస్తున్న రోగులు వైద్యం అందక నానా అవస్థలు పడుతున్నారు.
20 శాతం పీజీ ఇన్‌సర్వీసు కోటా కోసం..
మరోవైపు.. పీహెచ్‌సీ వైద్యుల సంఘం ప్రతినిధులతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ సోమవారం మంగళగిరిలోని కార్యాలయంలో చర్చించారు. పీజీ ఇన్‌సర్వీసు కోటా 20 శాతాన్ని అన్ని క్లినికల్ స్పెషాలిటీలకు వర్తింపజేయాలని వైద్యులు ప్రధానంగా డిమాండ్ చేశారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నందుకుగాను అలవెన్స్, పదోన్నతులు కల్పిస్తూ ఇతర సమస్యలనూ పరిష్కరించాలని కోరారు. అయితే, ఇన్‌సర్వీస్ కోటా విషయంలో ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు.
ఉదయం నుంచి రాత్రి వరకూ ఇన్‌సర్వీస్ కోటాపై వైద్యులకు సర్దిచెప్పేందుకు అధికారులెంత ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన హామీలేకపోవడంతో మంగళ, బుధవారాల్లో జిల్లా స్థాయిలో ఎమర్జెన్సీ సేవలను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వైద్యులు ప్రకటించారు. అలాగే, గురువారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చామని.. శుక్రవారం నుంచి విజయవాడలో ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. వైద్యుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి, కార్యదర్శి కిషోర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మెను జటిలం చేయకుండా ప్రభుత్వం వైద్యుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. వైద్యుల సంఘం పిలుపు ఇస్తే రోగనిర్ధారణ సేవలను నిలిపేస్తామని ఆయనన్నారు.
30 నుంచి 15 శాతానికి కుదింపు
నిజానికి.. క్లినికల్ విభాగంలో 30 శాతం, నాన్ క్లినికల్‌లో 50 శాతం చొప్పున గత ప్రభుత్వంలో ఇన్‌సర్వీస్ కోటా ఉండేది. ఈ కోటాను గతేడాది చంద్రబాబు ప్రభుత్వం రాగానే క్లినికల్ కోర్సుల్లో 15, నాన్ క్లినికల్‌లో 30 శాతానికి కుదించింది. దీంతో.. గతేడాదే పీహెచ్‌సీ వైద్యులు సమ్మెలోకి వెళ్లారు. అన్ని జిల్లాల నుంచి వైద్యులు విజయవాడకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగొచ్చింది.
అనంతరం క్లినికల్‌లో ఎంపిక చేసిన స్పెషాలిటీల్లో కోటాను 20 శాతానికి పెంచారు. అదే విధంగా భవిష్యత్తులో ఇన్‌సర్వీస్ కోటాపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వైద్యులతో చర్చిస్తామని కూడా హామీ ఇచి్చంది. అయితే, వైద్యుల సమ్మతి లేకుండానే ఈ విద్యా సంవత్సరానికి ఇన్‌సర్వీస్ కోటాను 20 నుంచి 15 శాతానికి కుదించడంతో వైద్యులు రగిలిపోతున్నారు.