పెనమలూరు: ఆంధ్రప్రదేశ్‌లో దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని, రైతు కన్నీరు రాష్ట్రానికి అరిష్టం కాదా? అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేశారు.
ఇందులో పేర్ని నాని మాట్లాడుతూ... ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి. వైసీపీ జెండా రెపరెపలాడాలి. చంద్రబాబు తన ధన బలంతో ఓటర్లను ప్రలోభ పెడతారు. ఓటర్లను డబ్బుతో కాదు ప్రేమతో కొనాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మానవత్వం..మంచితనం ఉన్న అభ్యర్థిని నిలబెట్టండి.
వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ మోహన్ రెడ్డితో చక్రవర్తి ఉన్నారు. పెనమలూరు నుంచి మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవభక్తుని చక్రవర్తి నిలబడతారు. ఈ ప్రభుత్వంలో యూరియా, డీఏపీ దొరక్క రైతు కష్టాలు పడుతున్నారు. యాప్ ద్వారా ఎరువులు తెచ్చుకోవాలని రైతులను కాల్చుకుతింటున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఆర్బీకే ద్వారా ఎరువులు అందించాం’’ అని చెప్పారు.
ప్రభుత్వాలు కూలిపోతాయి
రైతు కన్నీరు పెడితే ప్రభుత్వాలు కూలిపోతాయని పేర్ని నాని అన్నారు. ‘‘రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ పై చంద్రబాబు అండ్ ముఠా మతం అనే విషయుద్ధం చేయబోతున్నారు. వైఎస్ జగన్‌ను వదులుకున్నామని జనం బాధపడుతున్నారు. చంద్రబాబు , లోకేశ్‌కు డబ్బు పిచ్చి పట్టిందని సొంత పార్టీ వాళ్లే అంటున్నారు. వైఎస్ జగన్ కంటే ఎక్కువగా ఏమీ చేయలేదని చంద్రబాబుకు అర‍్థమైపోయింది. అందుకే మతం అనే ముద్రతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు.
క్రైస్తవ సభల్లో చంద్రబాబు మాట్లాడింది నీకు వినపడలేదా ఏబీఎన్ రాధాకృష్ణ? చంద్రబాబు పాపాలను దేవుడు వెంట వెంటనే బయటపెట్టేస్తున్నాడు. తిరుపతి లడ్డూలో ఏ జంతువు కొవ్వూ లేదని ఈడీ, సీబీఐ చెప్పింది. తిరుపతి వేంకటేశ్వరస్వామి ఎంత గొప్పవాడో ఇంతకంటే నిదర్శనం ఏముంది? మతం మార్చి ఓటు బ్యాంకుగా తీర్చిదిద్దారని వైఎస్ జగన్ పై తప్పుడు వార్తలు రాస్తున్నారు. అధికారం కోసం ఎంత దుర్మార్గంగానైనా ఈనాడు, జ్యోతి వార్తలు రాస్తాయి. మీ కులం తప్ప మరో కులం అధికారంలో ఉండకూడదా? కమ్మ కులస్తులే ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు. ఏ కార్యాలయానికి వెళ్లినా డబ్బులేనిదే పని కావడం లేదు’’ అని చెప్పారు.


