
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు కనెక్షన్లనివ్వడంలో వేగం మరింత పెంచాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హతే ప్రాతిపదికగా రైతులకు ఉచిత వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి అనుగుణంగా అధి కారులు పనిచేయాలని సూచించారు.
ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను ఈ నెలాఖరు నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. సబ్‌స్టేషన్ల నిర్మాణం మూడునెలల్లో పూర్తికావాలన్నారు. ఇకపై వ్యక్తులకు, సంస్థలకు సబ్‌స్టేషన్ల సంఖ్యను కూడా పరిమితం చేస్తూ టెండర్లను పిలవాలని, దీనివల్ల ఎక్కువమంది కాంట్రాక్టులు పొందుతారని, పనులు వేగంగా జరుగుతాయని చెప్పారు. విద్యుత్ తీగలు, కరెంటు స్తంభాలు, కండక్టర్లు వంటి పరికరాల భద్రతా ప్రమాణాలను పరిశీలించేందుకు నిర్వహించమన్న పోల్ టు పోల్ సర్వేపై నివేదిక ఇవ్వాలని కోరారు.
ప్రజలకు హాని జరిగే పరిస్థితులు పునరావృతం కాకుండా డిస్కంల సీఎండీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలుకు ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కమర్షియల్, ఇండస్ట్రియల్ కనెక్షన్లకు సంబంధించి బకాయిల వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు.
కొన్నిచోట్ల కోర్టు వ్యాజ్యాల వల్ల కరెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై న్యాయపోరాటం చేసి బకాయిలను వసూలు చేయాలని చెప్పారు. హైవాల్యూ కేసుల్లో అవసరమైతే సీనియర్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్దనరెడ్డి పాల్గొన్నారు.