
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మెగా పేరెంట్స్ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాలనుకున్న కూటమి ప్రభుత్వంలోని నాయకులకు చేదు అనుభవమే ఎదురైంది. ఈరోజు(గురువారం, జూలై 10) జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ కమిటీ సమావేశంలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

ప్రధానంగా విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ఉండటం లేదంటూ ఆందోళనకు దిగారు. కేవలం మీటింగ్‌ల సమయంలోనే మాత్రమే పిల్లలకు మంచి భోజనాలు పెడుతున్నారని, మిగతా సమయాల్లో భోజనంలో నాణ్యత కరువైందని నిరసన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం అందించిన బ్యాగులు కూడా ఏమాత్రం నాణ్యత లేవని ఓ విద్యార్థి తండ్రి ప్రశ్నించాడు. దాంతో కూటమి నాయకులు కంగుతిన్నారు. తల్లిదండ్రుల నుంచి ఈ తరహా నిరసన ఎదురవుతుందని ఊహించని కూటమి నాయకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దిమ్మతిరిగి పోయిన ఈ ఘటనతో తల్లిదండ్రులను సముదాయించే యత్నం చేశారు కూటమి నాయకులు.
