
నెలకో పండగ.. ఏడాదికో ఉత్సవం
సరికొత్తగా అలంకరణ
విభిన్న థీమ్‌లతో నిర్వహణ
ఏడాది పొడవునా సంబరాలు
రాజమహేంద్రవరం రూరల్: ఏ ఇంట అయినా క్యార్‌మని శబ్దం ఎప్పుడు వినిపిస్తుందా అని ఎదురుచూడని దంపతులు ఉండరు. ఆ రోజు కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ. అది ఫలించిన నాడు ఆ ఇంట అంతకు మించిన పండగ ఏముంటుంది. ఆ బిడ్డ పెరుగుదలలో ప్రతి అంకం ఆ ఇంట ఓ ఉత్సవమై అలరారుతుంది. గత తరాల అమ్మమ్మల సంప్రదాయం.. నేటి అమ్మల ట్రెండీనెస్ కలగలసి బుజ్జాయిల పుట్టిన రోజులు థీమ్‌లుగా రూపాంతరం చెందుతున్నాయి.
గత తరాల అమ్మమ్మలు శిశువు రెండో నెలలో నవి్వతే నువ్వుండలు చేసి పంచడం.. మూడో నెలలో బోర్లా పడితే బొబ్బట్లు చేసి సందడి చేయడం.. ఆరో నెలలో పాకడం మొదలుపెట్టగానే పరమాన్నం వండి నోరు తీపిచేయడం.. ఏడో నెల గడప దాటితే గారెలు వంటి సరదాగా దండ వేసి పంచడం.. పదో నెలలో అడుగులేస్తుంటే అరిసెలు వండడం.. అందరికీ తెలిసిందే. నేటికీ చాలా ఇళ్లలో ఈ సందడి కనిపిస్తున్నా వీటికి అదనంగా ప్రతి నెలా పుట్టినరోజు చేస్తూ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అదికూడా ట్రెండీగా.
ఏడాది పాటు ప్రతి నెలా ఒక్కో థీమ్‌తో పుట్టిన రోజును చేస్తున్నారు. ఆ పన్నెండు నెలల జ్ఞాపకాలను ఫొటో ఫ్రేమ్‌లు, వీడియోల రూపంలో క్రోడీకరించి మొదటి ఏడాది పుట్టినరోజును వైభవంగా నిర్వహిస్తూ బంధుమిత్రులకు చూపి, సోషల్ మీడియాలో పోస్టుచేసి లైక్‌లకు, కామెంట్లకు మురిసిపోతున్నారు. నయా బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
ప్రతి నెలా పండగే
మా గారాలపట్టి యశశ్వి పుట్టినరోజును ప్రతి నెలా ఓ వేడుకలా చేసుకుంటున్నాం. కుటుంబసభ్యులంతా కలిసి సందడి చేస్తాం. పిల్లల చిన్నప్పటి ఫొటోలు భద్రంగా ఉంచితే పెద్దయ్యాక చూసి మురిసిపోతారు. ప్రతినెల కొత్త బట్టలు వేసి ఒక్కో రకమైన వస్తువులు, ఇతర పండ్లతో నెలల నంబర్లు వేసి ఫొటోలు తీసుకుంటాం. ఏడాది పాటు ఈ ఫొటోలను భద్రపరచి ప్రదర్శిస్తాం. – సుకీర్తి, సచివాలయ ఉద్యోగి, నగరం
ఒక మధుర జ్ఞాపకం
ప్రస్తుతం పిల్లల పుట్టిన రోజులు నెలవారీగా చేస్తూ ఫొటోలు తీయడం సంప్రదాయంగా మారింది. ఈ ఫోటోలు వారి శారీరక వృద్ధి, హావభావాలు, వ్యక్తిత్వ వికాసాలను నెలనెలా చిత్రీకరిస్తూ.. వా ప్రగతిని కళ్లకు కడతాయి. ఇది కేవలం వయసు పెరిగిన రోజు కాదని, వారి బాల్యంలో అమూల్యమైన క్షణాలను పదిలం చేస్తాయి. – బి.హేమ, సైంటిస్ట్, రాజమహేంద్రవరం
కలకాలం గుర్తుండాలని...
బర్త్‌డేకి ఏడాది వరకు ఎదురు చూడడం ఎందుకని.. నెలనెలా ఒక్కో థీమ్‌తో మా పాపను రెడీ చేశా. ఫొటోలు తీసి భద్రంగా ఉంచా. పెద్దయ్యాక చూపిస్తే తను కూడా సంబరపడుతుంది. ఒకప్పుడంటే కెమెరామన్ వచ్చి ఫొటోలు తీసేవాడు. ఇప్పుడు ఫోన్‌లోనే ఫొటోలు తీసి ఎడిటింగ్ చేస్తున్నా. మంచి పాటను యాడ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే చాలా లైక్‌లు, కామెంటు వస్తున్నాయి. – వలవల దేదీప్య, గృహిణి, మోరంపూడి