
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడి బొప్పాయి తోట ధ్వంసం
సుమారు రూ.20 లక్షల మేర నష్టం
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడన్న అక్కసుతో ఓ రైతుకు చెందిన బొప్పాయి తోటను కూటమి నేతలు ధ్వంసం చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరులో జరిగింది. బాధిత రైతు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కల్లూరి చంద్రమౌళి కుటుంబం మొత్తం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీ నేతలు, గ్రామంలోని ఎస్సీలను రెచ్చగొట్టి వారిచేత చంద్రమౌళి, అతని బంధువులకు చెందిన 4.40 ఎకరాల పట్టా భూమిని స్వాదీనం చేసుకున్నారు.
అప్పటికే ఆ పట్టా భూమి వ్యవహారంపై కందుకూరు కోర్టులో చంద్రమౌళికి అనుకూలంగా స్టే ఆర్డరు ఉంది. అయినా దానిని ఆక్రమించి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఆక్రమణ విషయమై కలెక్టర్‌కు అర్జీ ఇవ్వడంతో సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అప్పటికే ఆ భూమిలో జేసీబీలతో గుంతలు తీయించి ఆక్రమణదారులు చిన్న గృహాల్లా కట్టుకుని అందులో బెల్టుషాపు నిర్వహిస్తున్నారు. బెల్ట్‌షాపు నిర్వాహకుడిని ఎక్సైజ్ సిబ్బంది పట్టుకోవడంతో అది చంద్రమౌళే పట్టించాడని నిర్వాహకుడు నానా హంగామా చేశాడు.
ఈక్రమంలో అధికారులు ఆక్రమిత భూమిలోని ఇళ్లను ఖాళీ చేయించారు. దీనిపై కక్ష పెంచుకున్న టీడీపీ వర్గీయులు సర్వే నంబర్ 49–1బీలో చంద్రమౌళి సాగు చేసిన బొప్పాయి తోటను శనివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దీంతో రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.