
సంపన్నులు, పేదలను ఒకే చోటకు చేర్చడమే లక్ష్యం
ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు రావొచ్చు
ఉగాది రోజున అమరావతిలో పీ–4 ప్రారంభం
ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ–4 విధానం ద్వారా ప్లాట్‌ఫామ్ నిర్మిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ–పీ–4 విధానంపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ–4లో భాగస్వాములు కావొచ్చన్నారు. పీ–4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరువర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడమేనని, ప్రభుత్వం తరఫున ఎవరికీ అదనపు సాయం ఉండదన్నారు.
ఉన్నతవర్గాల వాళ్లు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపాలని సూచించారు. లబ్ధి పొందేవారిని ‘బంగారు కుటుంబం’గా, సాయం చేసే వారిని ‘మార్గదర్శి’గా పిలవాలని సూచించారు. బంగారు కుటుంబం ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని, గ్రామసభ, వార్డు సభల ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందన్నారు. పీ–4 కార్యక్రమానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాల ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది.
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడండి
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం వేసవి ప్రణాళిక, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధిత శాఖలతో సీఎం సమీక్ష నిర్వహించారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన రూ.39 కోట్లు విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు బయట ప్రాంతాల్లో పని అప్పగించొద్దన్నారు.
ఆపరేషన్ మోడల్లో పోలవరం–బనకచర్ల
పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్లో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి ఆర్థిక భారం తగ్గించవచ్చన్నారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.