జనం సొమ్ముతో జల్సా! | Outpouring of criticism against the MD of the Womens Fund | Sakshi
Sakshi News home page

జనం సొమ్ముతో జల్సా!

Jun 4 2025 2:54 AM | Updated on Jun 4 2025 2:54 AM

Outpouring of criticism against the MD of the Womens Fund

ఉత్తరాంధ్రలోని ఓ మంత్రి కోసం ‘స్త్రీనిధి’ సొమ్ము దుబారా

రూ.35 లక్షలతో కారు కొనుగోలుకు తీర్మానం 

నెలనెలా రూ.30వేల చొప్పున దాని నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించేలా నిర్ణయం 

అడ్డగోలుగా నియామకాలు.. ఇష్టారాజ్యంగా వేతనాల పెంపుదల 

ఐదేళ్ల క్రితం తొలగించిన వారికి మళ్లీ అధిక వేతనాలతో అందలం 

దుబారా ఖర్చుల కోసం అన్నట్లుగా పొదుపు మహిళల వడ్డీ మార్జిన్‌ చెల్లింపులోనూ కోత 

ఫలితంగా ఏటా రూ.10 కోట్ల మేర నష్టపోనున్న మహిళా సంఘాలు 

సంస్థ ఎండీ తీరుతెన్నులపై విమర్శల వెల్లువ 

సాక్షి, అమరావతి : స్త్రీనిధి సంస్థ ద్వారా పొదుపు సంఘాల మహిళలకిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీ సొమ్మును ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రిగారి జల్సాల కోసం దుబారా చేస్తున్నారు. రూ.35 లక్షలతో ఓ కారు కొనడమే కాక.. నెలనెలా దాని పెట్రోల్‌ ఖర్చుల కోసం మరో రూ.30 వేల చొప్పున సమర్పించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం స్త్రీనిధి సంస్థ మేనేజింగ్‌ కమిటీ (ఎంసీ) సమావేశంలో ఇప్పటికే తీర్మానం కూడా జరిగిపోయిందని.. అమలుచేయడమే తరువాయని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో స్త్రీనిధి సంస్థలోకి డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ ఉన్నతాధికారే ఈ తతంగమంతా నడిపిస్తున్నట్లు సమాచారం. నిజానికి.. స్త్రీనిధి సంస్థ ఎండీగా కొనసాగుతున్న సదరు అధికారి వినియోగానికి ఇప్పటికే ఓ ఇన్నోవా కారు ఉండగా, ఆయన అవసరాల కోస­మంటూ కొత్తగా రూ.35 లక్షల సంస్థ నిధులతో మరో ఇన్నోవా కారు సిద్ధంచేస్తున్నా­రు. ఈ రెండింటిలో ఒకటి సదరు మంత్రి తన సొంత నియోజకవర్గంలో ఉన్నప్పుడు వినియోగించుకోవడా­నికి అప్పగించాలని నిర్ణయించారు.

మంత్రి పేషీ ఉద్యోగులకూ స్త్రీనిధి నుంచే జీతాలు.. 
ఇదే కాదు.. సదరు ఉన్నతాధికారి స్త్రీనిధి సంస్థలో కొందరు అస్మదీయులకు భారీగా వేతనాలు పెంచుతూ నిర్ణయాలు తీసుకోవడం కూడా వివాదాస్పదమవుతోంది. ఓ మంత్రి పేషీలో పీఏగా పనిచేస్తున్న వ్యక్తితో పాటు సీఎంఓలో పనిచేసే మరో ఇద్దరికీ స్త్రీనిధి సంస్థ నుంచే వేతనాలు చెల్లించేందుకు సదరు ఉన్నతాధికారి ఆమోదం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. పీఏగా పనిచేస్తున్న వ్యక్తి గతంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో పనిచేసినట్లు తెలుస్తోంది. 

అతనితో పాటు మరొకరికి నెలకు రూ.35 వేల చొప్పున వేతనంతో ‘స్త్రీనిధి’లో ఉద్యోగం ఇచ్చి, నెలల వ్యవధిలోనే దానిని రూ.45 వేలకు పెంచారు. దీనికి అదనంగా టీఏ, డిప్యూటేషన్‌ భత్యం అంటూ మరో రూ.20 వేలు చెల్లించేలా స్త్రీనిధి ఉన్నతాధికారి చక్రం తిప్పారని అందులోని సిబ్బంది చెబుతున్నారు. అలాగే, ఐదేళ్ల క్రితం వివిధ కారణాలతో ఈ సంస్థ నుంచి తొలగించిన ముగ్గురు అధికారుల పునరి్నయామకానికి ఆ ఉన్నతాధికారి ఆమోదం తెలిపారని.. పైగా వారి వేతనాలూ భారీగా నిర్ధారించారని సంస్థలోని ఉద్యోగులు మండిపడుతున్నారు. 

పొదుపు మహిళల వడ్డీ మార్జిన్‌లో కోత.. 
ఇదిలా ఉంటే.. మంత్రి కోసం స్త్రీనిధి సంస్థ ద్వారా కారు కోనుగోలుకు తీర్మానం చేసిన సమావేశంలోనే మరో కీలక తీర్మానం చేశారు. దుబారా ఖర్చుల కోసమా అన్నట్లుగా పొదుపు సంఘాల రుణాలపై వసూలుచేసే వడ్డీలో గ్రామ, మండల సమాఖ్యలకిచ్చే వడ్డీ మార్జిన్‌ను 50 శాతం మేర తగ్గించాలని నిర్ణయించారు. 

ప్రస్తుతం స్త్రీనిధి సంస్థ మహిళలకిచ్చే రుణాలపై 11.5 శాతం చొప్పున వడ్డీ వసూలుచేస్తుండగా, అందులో రెండు శాతం వడ్డీ డబ్బులను తిరిగి ఏడాది చివరిన ఆయా గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యలకు చెల్లిస్తున్నారు. కానీ, ఇప్పుడా వడ్డీ మార్జిన్‌ కోత నిర్ణయంతో పొదుపు మహిళలు భారీగా నష్టపోనున్నారు. వడ్డీ మార్జిన్‌ను రెండు నుంచి ఒక శాతానికి కోత వేయడంవల్ల వారు ఏటా దాదాపు రూ.10 కోట్ల మేర నష్టపోయే అవకాశముంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement