డీఎస్సీపై చర్చకు భయమెందుకని నిలదీత
నల్లకండువాలు ధరించి.. నేలపై కూర్చొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
వెన్నుపోటు పార్టీ డౌన్ డౌన్.. లోకేశ్ రాజీనామా చేయాలంటూ నినాదాల హోరు
ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా మండలిలోకి ప్రతిపక్ష ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ– 2025లో జరిగిన అక్రమాలు, అవినీతిపై శానసమండలిలో చర్చించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. శాసనసభలో డీఎస్సీపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి బల్లలు చరిపించుకున్న వారు మండలిలో చర్చకు ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. లక్షలాది మందికి సంబంధించిన అంశంపై మండలిలో చర్చించాలని వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం అందజేస్తున్నా తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడో రోజు సమావేశాలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలతో హాజరయ్యారు. అంతకముందు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ డీఎస్సీపై చర్చకు రాని వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం డౌన్ డౌన్, మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. డీఎస్సీపై సీబీఐ విచారణ వేయాలి.. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.


