మూడోరోజు శాసన మండలిలో డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబట్టిన వైఎస్సార్‌సీపీ
సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో వెంటనే చర్చ చేపట్టాలంటూ పోడియం వద్ద ఆందోళన
విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలంటూ నినాదాలు.. వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళనతో 10 నిమిషాలకే సభ వాయిదా
మళ్లీ సభ ప్రారంభమయ్యాక డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగింపు
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, బేరసారాలపై చర్చ జరగాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు వరుసగా మూడోరోజు బుధవారం కూడా శాసనమండలిలో పట్టుబట్టారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు నిగ్గుతేలాలి.. సీబీఐ విచారణ జరపాల్సిందే.. అంటూ ఆందోళన కొనసాగించారు. నల్లజెండాలు మెడలో వేసుకొని చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. డీఎస్సీ–2025 నిర్వహణ, నియామకాలపై చర్చ కోరుతూ సభ్యులు టి.కల్పలత, ఎం.వి.రామచంద్రారెడ్డి, పి.చంద్రశేఖర్‌రెడ్డి ఉదయం వాయిదా తీర్మానం ఇచ్చారు.
సభ ప్రారంభం కాగానే చైర్మన్ మోషేన్‌రాజు ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు చర్చకు అనుమతించాలంటూ పోడియం వద్దకు వెళ్లి డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత చర్చకు అనుమతించడం కుదరదంటూ చైర్మన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు డీఎస్సీ అక్రమాలపై చర్చకు వెంటనే అనుమతించాలని నినాదాలు చేస్తూ పోడియంపైన చైర్మన్ వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. పోడియం కింద ఉన్న పలువురు సభ్యులు బల్లలు చరుస్తూ నినాదాలు కొనసాగించారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలి.. మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు.
చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వమే ప్రొసీజర్స్ ఫాలో కావాలి కదా: చైర్మన్
ఈ సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుంటూ పోడియంపైకి వచి్చన సభ్యులపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ మోషేన్‌రాజును కోరారు. ‘వాళ్లను కిందకు రమ్మనండి. మీరు చెప్పాలి. అది ప్రొసీజర్..’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ.. ‘మీరు మంత్రి. స్పీకర్‌గా కూడా చేసి ఉన్నారు. మీరు పదేపదే సభను అర్డర్‌లో పెట్టమంటున్నారు. తప్పులేదు. చర్యలు తీసుకోమంటున్నారు.
కానీ చర్యలు తీసుకోమన్నప్పుడు దానికి ఏం ప్రొసీజర్ ఉందో ప్రభుత్వపరంగా ఫాలో అవండి. అంతేతప్ప మీరు పదేపదే చైర్‌ను పెద్దస్వరంతో.. ఏదో చేయలేకపోతున్నారు అనడం సరికాదు. మీకు అన్ని రూల్స్ తెలుసు. చర్యలు ఏం తీసుకోవాలో, రూల్స్ ఫాలో అవండి’ అంటూ సూచించారు. మంత్రి నాదెండ్ల, చైర్మన్ల మధ్య ఈ చర్చ జరిగే సమయంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్రస్వరంతో నినాదాలు కొనసాగించడంతో కేవలం పది నిమిషాలకే సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు.
చైర్మన్‌కు మంత్రులు పాఠాలు చెప్పడం సరికాదు: బొత్స సత్యనారాయణ
తిరిగి 11 గంటల సమయంలో సభ ప్రారంభమైన తరువాత మంత్రి నాదెండ్ల, మండలి చైర్మన్ మధ్య జరిగిన సంభాషణ మరోసారి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌ను ఉద్దేశించి మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. ‘సభలో నిబంధనలు ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఒకే రకంగా వర్తిస్తాయి. చిన్న అలసత్వం ఏదైనా జరిగితే మీకు చెప్పవచ్చు కానీ, మీకు హితబోధ చేయడం సరికాదు. దురదృష్టకరం. మంత్రి వైఖరి చాలాసార్లు చూశా. సభ్యుల ఆవేదన కూడ చైర్మన్ పరిశీలించాలి. మా డిమాండ్ ఒక్కటే.. డీఎస్సీ అక్రమాలపై చర్చ జరగాలని.
కానీ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది. ప్రభుత్వం బయట మాత్రం ప్రతిచోట చర్చకు మేం సిద్ధమేనని చెబుతోంది. చర్చ జరపమనే మేం అడుగుతున్నాం. కానీ చైర్మన్‌కు పాఠాలు చెప్పడాన్ని ఖండిస్తున్నాం. మంత్రులే భాషను తూలనాడుతున్నారు. మేం తప్పుగా మాట్లాడితే చూపించండి’ అని బొత్స పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. తరువాత మరోసారి వాయిదా పడి తిరిగి 12.45 గంటలకు ప్రారంభమైన సభ పదినిమిషాల వ్యవధిలోనే గురువారానికి వాయిదా పడింది.


