హోం మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా గ్రావెల్, మట్టి దోపిడీ
అనకాపల్లి, కాకినాడ జిల్లాల సరిహద్దుల్లో అర్ధరాత్రి తవ్వకాలు
తుని టీడీపీ నేతల సహకారంతో అడ్డగోలు దందా
స్థానికుల ఫిర్యాదుతో మూడు లారీలను సీజ్ చేసిన పోలీసులు
సాక్షి, అనకాపల్లి: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గాల సరిహద్దులో తాండవ చక్కెర కర్మాగారం సమీపంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ఎడమ కాలువ గట్లను పగలు, రాత్రి అనే తేడా లేకుండా కూటమి నేతలు అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇక్కడ తవ్విన మట్టి, గ్రావెల్‌ను నక్కపల్లి మండల పరిధిలోని ప్రైవేట్ లేఅవుట్లకు తరలిస్తున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
వాటిపై స్పందించిన పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టి, అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తనిఖీల విషయం తెలిసిన వెంటనే వెనుక వస్తున్న ఇతర లారీలను జాతీయ రహదారి పక్కనే నిలిపివేసి ఆగమేఘాలపై మట్టిని అన్‌లోడ్ చేసి పారిపోయారు. కాగా.. పోలీసులు పట్టుకున్న లారీల వద్ద ఏఎంఆర్ సంస్థ జారీ చేసిన బిల్లులు ఉన్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం పోలవరం కాలువ గట్లపైగానీ, చెరువుల్లోగానీ మట్టి తవ్వకాలు జరపాలంటే రెవెన్యూ, ఇరిగేషన్ ముందస్తు అనుమతులు తప్పనిసరి. అంతేకాకుండా ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించిన తర్వాతే తవ్వకాలు ప్రారంభించాల్సి ఉంటుంది.
అయితే.. ప్రభుత్వం నియమించిన ఏఎంఆర్ సంస్థ కేవలం అనధికారికంగా రవాణా అయ్యే ఇసుక, మట్టి, గ్రావెల్‌ను తనిఖీ చేసి సెస్సు వసూలు చేయడానికి మాత్రమే పరిమితం కావాలి. కానీ, అనుమతులు లేని పోలవరం కాలువ మట్టి, గ్రావెల్‌కు ఈ సంస్థ బిల్లులు ఎలా ఇస్తోందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నకిలీ బిల్లులను సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
హోంమంత్రి అండదండలతోనే..
హోంమంత్రి ఇలాకాలో విచ్చలవిడిగా మట్టి, గ్రావెల్ మాఫియా జరుగుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. తమకు హోంమంత్రి అండదండలున్నాయంటూ అక్రమార్కులు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. తుని నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి అనుచరుడు అధికారులను బెదిరిస్తూ పోలవరం కాలువ గట్లను తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ముకుందరాజుపేట, రమణయ్యపేట, గుల్లిపాడు పరిసర ప్రాంతాల నుంచి మెరక గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి సహకారంతో పోలవరం కాలువ నుంచి సుమారు 6వేల ట్రిప్పుల గ్రావెల్‌ను గుల్లిపాడు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ ఎత్తు పెంచే పనులకు తరలించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పోలవరం కాలువ నుంచి ప్రతిరోజూ సుమారు రూ.10 లక్షల విలువైన గ్రావెల్, మట్టిని కొల్లగొడుతున్నారు. ఈ లెక్కన నెలకు రూ.3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు అక్రమార్కులు ఆర్జిస్తున్నట్లు సమాచారం.


