బీసీ రిజర్వేషన్లపై బాబు బురిడీ | Government to report on local body elections on Wednesday | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లపై బాబు బురిడీ

Aug 20 2026 5:20 AM | Updated on Aug 20 2026 5:20 AM

Government to report on local body elections on Wednesday

ఎన్నికల రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలంటూ అడ్వకేట్‌ జనరల్‌కు హైకోర్టు సూచనతో బాబు కపట నాటకం మరోసారి తేటతెల్లం 

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగ చట్టబద్ధత 

కోర్టులు జోక్యం చేసుకుంటే బీసీ రిజర్వేషన్లకే కోత పడుతుందంటున్న అధికార యంత్రాంగం 

అందుకే బీసీ రిజర్వేషన్లకూ దీర్ఘకాలంగా చట్టబద్ధత కోరుతున్న బీసీ సంఘాలు  

కేంద్రంలో టీడీపీ అధికారంలో కొనసాగుతున్నా ఆ దిశగా చంద్రబాబు చర్యలు శూన్యం 

తాజాగా అసెంబ్లీలోనూ చర్చ సందర్భంగా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధతపై కేంద్రాన్ని కోరుతూ  కనీసం తీర్మానం చేయకుండా నిజ స్వరూపాన్ని చాటుకున్న చంద్రబాబు 

బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి అంటూ నాడు పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లు పెట్టిన వైఎస్సార్‌సీపీ  

సాక్షి, అమరావతి: బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధమైన ప్రక్రియను పక్కనపెట్టిన చంద్రబాబు సర్కారు ఒక్కపక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై బీసీలను మ«భ్యపెడుతూ మరోపక్క న్యాయస్థానాలు తప్పుబట్టే నిర్ణయాలతో ఆటలాడుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం బుధవారం నివేదిక అందజేసిన సందర్భంగా ఎన్నికల రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలంటూ హైకోర్టు  రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌కు సూచించటాన్ని బట్టి చంద్రబాబు బురిడీ రాజకీయాలు స్పష్టమవుతున్నాయి. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపులు కొనసాగుతుంటాయి. 

అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చూడాలంటే బీసీల రిజర్వేషన్లకు కోత పెట్టాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బీసీ రిజర్వేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందువల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటే పరిస్థితి ఉంటే హైకోర్టు ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్లే తగ్గించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధత కావాలని బీసీ సంఘాలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు దీన్ని విస్మరించి న్యాయస్థానాలు తప్పుబట్టేలా వ్యవహరించటాన్ని బట్టి బీసీ రిజర్వేషన్లపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందనే చర్చ జరుగుతోంది.  

రెండేళ్లుగా చిన్న ప్రయత్నమైనా చేయకుండా డ్రామాలు.. 
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ పరమైన రక్షణ లేకపోవడం, జనాభా లెక్కలు లేకపోవడంతో స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల స్వేచ్ఛకు వదిలిపెట్టారు. చట్టబద్ధమైన బీసీ జనాభా లెక్కల వివరాలు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. కేంద్రంలో ప్రస్తుతం టీడీపీపై ఆధారపడిన ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతున్నప్పటికీ పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధతపై రెండేళ్లుగా సీఎం చంద్రబాబు చిన్న ప్రయత్నం కూడా చేయకుండా డ్రామాలాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తాజాగా శాసనసభలో చర్చ సందర్భంలో సైతం దీనికి చట్టబద్ధతపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కనీసం తీర్మానం చేయకపోవటాన్ని బట్టి చంద్రబాబు అసలు నైజం తెలుస్తోందనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేవలం మంత్రివర్గం నిర్ణయంతో సరిపెట్టడం బట్టి రిజర్వేషన్ల చెల్లుబాటుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెట్టారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. బీసీల కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గత ప్రభుత్వం అసెంబ్లీలో సైతం తీర్మానం చేసి కేంద్రానికి పంపి చిత్తశుద్ధి చాటుకుంది. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని నాడు వైఎస్‌ జగన్‌ కోరడం గమనార్హం.   ­

బీసీ రిజర్వేషన్లపై మరో కుట్ర
» 34 శాతం రిజర్వేషన్లపై రేపు కోర్టుకు వెళ్లేది చంద్రబాబే  
» వైఎస్సార్‌సీపీ నేత, మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌  
సాక్షి, అమరావతి: స్థానికసంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతున్నట్లు వెన్నుపోటు పార్టీ అధినేత చంద్రబాబు డప్పు కొట్టుకోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీమంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ విమర్శించారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచితే, తన మనుషులతో కోర్టులో పిటిషన్లు వేయించి అడ్డుకున్న ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. అనిల్‌ బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

రిజర్వేషన్ల పెంపు పేరుతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని, ఈసారి కూడా తన మనుషులతో వీటిపై పిటిషన్లు వేయించి వైఎస్సార్‌సీపీ మీదకు నెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పారు. అందుకే ముందస్తుగా లీకులిస్తున్నారన్నారు. ‘బీసీలకు 50 శాతం పదవులిచ్చింది వైఎస్‌ జగన్‌. కోర్టు రిజర్వేషన్లు తగ్గిస్తే రాజకీయంగా పదవులిచ్చారు. బీసీలను నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది. స్థానికసంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధిచెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారు.  

జగన్‌ ఇచ్చిన రిజర్వేషన్లను అడ్డుకుంది మీరేగా 
గతంలో జగన్‌ రాజకీయ పదవుల్లో 50 శాతాన్ని బీసీలకు ఇచ్చారు. 25 మంది ఎంపీలుంటే అందులో 11 ఎంపీ సీట్లు ఇచ్చారు, రాజ్యసభలో సైతం మొదటిసారి నాలుగు ఎంపీ పదవులు ఇచ్చారు. 58 ఎమ్మెల్సీ పదవుల్లో 28 మంది బీసీలకు అవకాశం కల్పించారు. 13 మేయర్‌ పోస్టుల్లో తొమ్మిది బీసీలకు ఇచ్చారు. జెడ్పీ చైర్మన్‌ పదవులు 13లో ఆరు బీసీలకు ఇచ్చారు. 84 మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల్లో 44 బీసీలకు ఇచ్చారు. ఇలా చూసుకుంటే 40 నుంచి 60 శాతం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల పదవుల్ని జగన్‌ బీసీలకు ఇచ్చారు. 

పార్లమెంట్‌లో 50 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రైవేటు బిల్లు పెట్టించిన ఘనత జగన్‌దే. మీరు ఒక్కసారి అయినా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఇప్పుడు మొదట వడ్డెర కులస్తులకు ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొంటున్నారు. అసలు బీసీలకు ఈ విధంగా పదవులు ఇవ్వాలని జగన్‌ అంకురార్పణ చేస్తే, దాన్ని అమలుచేయక తప్పని పరిస్ధితి మీది. 2019కి ముందు మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పదవుల్లో ఎంత మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో చూడాలి. జగన్‌ హయాంలో 196 మార్కెట్‌ యార్డుల్లో 76 చోట్ల బీసీలు చైర్మన్లు అయ్యారు. వడ్డెర్లకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి, ఓడిపోయినా ఏసురత్నం రూపంలో మండలిలో స్థానం కల్పించారు’ అని అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. చాలా చిన్నస్థాయిలో ఉన్నవారికి కూడా జగన్‌ ఊహించని పదవులు ఇచ్చారన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement